తెలంగాణ

telangana

ETV Bharat / state

కొనసాగుతున్న 'పల్లా' ఆమరణ దీక్ష... ఉడుకుతున్న 'ఉక్కు' నగరం - ap news

విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఏపీ వ్యాప్తంగా ఆందోళనలు జరుగుతున్నాయి. తెలుగుదేశం నేత పల్లా శ్రీనివాసరావు చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష నాలుగో రోజు కొనసాగింది. అతని కుటుంబసభ్యులు దీక్షా శిబిరానికి వచ్చి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. పల్లా దీక్షకు తెలుగుదేశం నేతలతో పాటు కార్మిక సంఘాలు, నిర్వాసిత కాలనీల సంఘాలు సంఘీభావం తెలిపాయి.

కొనసాగుతున్న 'పల్లా' ఆమరణ దీక్ష... ఉడుకుతున్న 'ఉక్కు' నగరం
కొనసాగుతున్న 'పల్లా' ఆమరణ దీక్ష... ఉడుకుతున్న 'ఉక్కు' నగరం

By

Published : Feb 13, 2021, 11:01 PM IST

విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా గాజువాకలో తెలుగుదేశం నేత పల్లా శ్రీనివాసరావు చేస్తున్న ఆమరణ నిరాహార దీక్ష... నాలుగో రోజూ కొనసాగింది. వైద్యులు శనివారం ఆయనకు పరీక్షలు నిర్వహించారు. పల్లా శ్రీనివాసరావు తండ్రి, భార్య, పిల్లలు దీక్షా శిబిరానికి వచ్చి... ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. పల్లా ఆమరణ నిరాహార దీక్షకు తెలుగుదేశం సీనియర్ నేత, కేంద్ర మాజీమంత్రి అశోక్‌ గజపతిరాజుతో పాటు విశాఖ తెలుగుదేశం నేతలు సంఘీభావం తెలిపారు.

ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ వ్యతిరేక ఉద్యమం... మరింత ఊపందుకుంది. కేంద్రం నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలంటూ.. రాజకీయ పార్టీలు, కార్మిక సంఘాలు ఆందోళన బాటపట్టాయి. ఉద్యమానికి సంఘీభావంగా గుంటూరులో మాజీమంత్రి నక్కా ఆనందబాబు ఆధ్వర్యంలో ధర్నా చేశారు. అమృతారావు విగ్రహానికి పూలమాలలు వేసి నిరసన తెలిపారు.

వైకాపా నేతలు నిరసన ర్యాలీ చేపట్టారు. అమరావతి రోడ్డులోని అమృతరావు విగ్రహానికి ఎమ్మెల్సీ డొక్కా మాణిక్యవరప్రసాద్‌, అమృతారావు కుటుంబసభ్యులు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. కేంద్ర ప్రభుత్వం వెంటనే తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.

విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ... పల్లా శ్రీనివాస్ చేస్తున్న నిరాహార దీక్షకు తెలుగుదేశం నాయకులు సంఘీభావం తెలిపారు. జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. ఈ రిలే నిరాహార దీక్షకు గీతం విశ్వవిద్యాలయం ఛైర్మన్, విశాఖ తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు భరత్, ఎమ్మెల్సీ దువ్వారపు రామారావు మద్దతు తెలిపారు. ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణను అందరూ వ్యతిరేకించాలని పిలుపునిచ్చారు.

కార్మిక సంఘాలతో కలసి ఉద్యమిస్తాం..

కేంద్రంలోని భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటుపరం చేసే నిర్ణయాన్ని ఉపసంహరించుకునే వరకూ తాము కార్మిక సంఘాలతో కలసి ఉద్యమిస్తామని... రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు ఉద్ఘాటించారు. విశాఖ జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద చైతన్య స్రవంతి సంస్థ ఆధ్వర్యంలో విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ... నిర్వహిస్తున్న నిరసన శిబిరాన్ని ఉద్దేశించి మంత్రి ప్రసంగించారు. రాష్ట్రంలో బలపడాలని భాజపా నాయకులు అంటున్నారని... ప్రైవేటీకరణను వ్యతిరేకించి కేంద్రంపై ఒత్తిడి తేవాలని కోరారు. ఏపీ సీఎం జగన్ ఇప్పటికే ప్రధానికి లేఖ రాసి కేంద్ర నిర్ణయాన్ని వ్యతిరేకించారని మంత్రి గుర్తుచేశారు.

ఇదీ చూడండి:పోరాట యోధుడిగా, పాలకుడిగా.. కేసీఆర్​ 'ఒక్కగానొక్కడు'

ABOUT THE AUTHOR

...view details