AFRC Angry Over Charging High Fees: ఇంజినీరింగ్ కాలేజీల్లో అధిక ఫీజుల వసూలు, బీ కేటగిరీ సీట్ల కేటాయింపులో అక్రమాలపై రాష్ట్ర ప్రవేశాలు, రుసుముల నియంత్రణ కమిటీ.. టీఎస్ఏఎఫ్‌ఆర్‌సీ ఆగ్రహం వ్యక్తం చేసింది. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న కళాశాలలపై చర్యలు తీసుకోవాలని నిర్ణయించింది. ఏఎఫ్‌ఆర్‌సీ ఛైర్మన్ జస్టిస్ స్వరూప్ రెడ్డి అధ్యక్షతన ఇవాళ జరిగిన సమావేశానికి విద్యా శాఖ కార్యదర్శి వాకాటి కరుణ, ఉన్నత విద్యా మండలి ఛైర్మన్ లింబాద్రి, జేఎన్టీయూహెచ్, ఓయూ వీసీలు కట్టా నర్సింహారెడ్డి, రవీందర్, తదితరులు హాజరయ్యారు.
ఏఎఫ్‌ఆర్‌సీ సిఫార్సుల మేరకు ప్రభుత్వం ఖరారు చేసిన ఫీజులనే తీసుకోవాలని ఏఎఫ్‌ఆర్‌సీ స్పష్టం చేసింది. అధిక ఫీజు వసూలు చేస్తే కాలేజీలోని ఒక్కో విద్యార్థికి 2 లక్షల రూపాయల చొప్పున జరిమానా విధించాలని నిర్ణయించింది. అదనంగా వసూలు చేసిన ఫీజును విద్యార్థికి తిరిగి ఇవ్వడంతో పాటు జరిమానా చెల్లించాల్సి ఉంటుందని ఏఎఫ్‌ఆర్‌సీ స్పష్టం చేసింది. బీ కేటగిరీ సీట్ల కేటాయింపులో అక్రమాలు జరిగాయన్న ఫిర్యాదులపై కూడా చర్చించిన ఏఎఫ్‌ఆర్‌సీ తమ దరఖాస్తులను పరిగణనలోకి తీసుకోవడం లేదంటూ పలువురు విద్యార్థులు ఇచ్చిన ఫిర్యాదులను ఇప్పటికే సంబంధిత కాలేజీలకు పంపించింది.