తెలంగాణ

telangana

ETV Bharat / state

Afghanistan Students: సొంతదేశం వెళ్లలేం.. హైదరాబాద్‌ను వీడలేం - హైదరాబాద్​లో చదువుకుంటున్న అఫ్గానిస్తాన్​ విద్యార్థులు

ఉన్నత విద్య కోసం స్వదేశాన్ని వదిలి భారత్​కు వచ్చారు. మంచిగా చదువుకుంటూ.. బంగారు భవిష్యత్​ కోసం కలలు కంటున్న వారికి కొన్నిరోజులుగా మనసు మనసులో లేదు. మాతృభూమి ముష్కర మూకల చేతుల్లో బందీ అయ్యిందన్న సమాచారంతో కంటతడి పెడుతున్నారు. తమ వారు ఎలా ఉన్నారో తెలుసుకునేందుకు పరితపిస్తున్నారు. అఫ్గానిస్థాన్​లో ఉంటున్న తల్లిదండ్రుల క్షేమ సమాచారం కోసం ఆశగా నిరీక్షిస్తున్నారు.

Afghanistan Students
ముష్కర మూకల చేతుల్లో మాతృభూమి

By

Published : Aug 17, 2021, 9:54 AM IST

కన్నవారికి ఏమైనా జరగుతుందేమోనని, బంధువులు భద్రంగా ఉన్నారో లేదోనని భయాందోళన.. ఎప్పటికప్పుడు క్షేమ సమాచారం తెలుసుకోవాలన్న ఉత్కంఠ.. రోజురోజుకీ మారుతున్న పరిస్థితులతో బెంగ.. ఇలా నగరంలోని అఫ్గానిస్థాన్‌ విద్యార్థులు కలవరపడుతున్నారు. మాతృభూమి ముష్కర మూకల చేతుల్లో బందీ అయ్యిందన్న సమాచారంతో కంటతడి పెడుతున్నారు. చదువుకుని ఉన్నత స్థానాల్లో స్థిరపడదామని వచ్చి తిరిగి వెళ్లే దారి కనిపించక ఆందోళన చెందుతున్నారు. ప్రస్తుతం నగరంలో 250 మంది వరకు అఫ్గానిస్థాన్‌ నుంచి వచ్చి చదువుకుంటున్న విద్యార్థులు ఉన్నారు. వీరంతా ఉస్మానియా విశ్వవిద్యాలయం, జేఎన్‌టీయూ, ఇఫ్లూ, హెచ్‌సీయూలో విద్యనభ్యసిస్తున్నారు. ఇందులో ఒక్క ఉస్మానియా విశ్వవిద్యాలయంలోనే 158 మంది విద్యార్థులున్నారు. వీరిలో 136 మంది బాలురు, 22 మంది బాలికలు. వీరంతా డిగ్రీ, పీజీ, పీహెచ్‌డీ చేసేందుకు సొంత దేశం నుంచి వచ్చి ఇక్కడే ఉండి చదువుకుంటున్నారు. వాస్తవానికి గతేడాది లాక్‌డౌన్‌ సమయంలో కొందరు విద్యార్థులు అఫ్గానిస్థాన్‌కు వెళ్లిపోయారు. ప్రస్తుతం పరీక్షలు జరుగుతుండటంతో తిరిగి హైదరాబాద్‌ చేరుకున్నారు.

బంధువుల సమాచారం తెలుసుకునేందుకు..

అఫ్గానిస్థాన్‌లో ఉంటున్న తల్లిదండ్రులు, బంధువులతో మాట్లాడుతూ సమాచారం తెలుసుకుంటున్నారు. ప్రధాన పట్టణాల్లో ఉన్న బంధువుల సమాచారం తెలుసుకోగలుగుతున్నారు. కాస్త గ్రామీణ వాతావరణంలోని ప్రాంతాలలో ఇంటర్నెట్‌ సదుపాయం నిలిపివేయడంతో క్షేమ సమాచారం తెలియడం లేదని విద్యార్థులు వాపోతున్నారు. తమ వారి క్షేమ సమాచారం తెలుసుకుని చెప్పాలని ఎంబసీ అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నారు. అక్కడి సమాచారం ఎప్పటికప్పుడు టీవీలు, ఇతర మాధ్యమాల సాయంతో తెలుసుకుంటున్నారు.

ముగుస్తున్న వీసాల గడువు

ఒకవైపు సొంతదేశంలో పరిస్థితులు భయానకంగా మారగా.. అక్కడికి వెళ్లేందుకు విద్యార్థులు జంకుతున్నారు. మరో రెండు నెలల్లో 45-50 మంది విద్యార్థుల వీసాల గడువు ముగియనుంది. ఈ నేపథ్యంలో ఉపకార వేతనాలకు దరఖాస్తు చేసుకుని మరో కోర్సు లేదా ఉన్నత విద్య చదివేందుకు ప్రయత్నాలు చేసుకుంటున్నారు.

‘‘మాది అఫ్గానిస్థాన్‌లోని కాబూల్‌. ప్రస్తుతం నేను ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఎంఏ సైకాలజీ చేస్తున్నా. 2019లో ఇక్కడికి వచ్చాను. నిత్యం మా తల్లిదండ్రులతో మాట్లాడుతున్నా. వారు భద్రంగా ఉన్నారని చెబుతున్నారు. ఇప్పుడు కాస్త యుద్ధ వాతావరణం సద్దుమణగడంతో పరిస్థితులు స్థిరంగా ఉన్నాయని చెబుతున్నారు. ఇక్కడ ఉన్న విద్యార్థులందరూ తమ వాళ్లకు ఏమైనా జరుగుతుందేమోనని ఆందోళన చెందుతున్నారు. చాలామంది వీసాలు రెండు, మూడు నెలల్లో ముగియనున్నాయి. మా దేశానికి వెళ్లే పరిస్థితి లేదు. భారత ప్రభుత్వం స్పందించి వీసా గడువు పొడిగించాలని కోరుతున్నాం.’’

- యూనుస్‌ షఫీ, అఫ్గాన్‌ విద్యార్థి సంఘం ఉపాధ్యక్షుడు

‘‘మాది ఫమంగన్‌ ప్రావిన్స్‌. ఇక్కడి పరిస్థితులు భయానకంగా ఉన్నాయి. తాలిబన్లు ఆక్రమణతో ప్రజలు భయాందోళనతో వణికిపోతున్నారు. నేను ఉస్మానియా వర్సిటీలో ఎంఏ పూర్తి చేశా. పీహెచ్‌డీ చేసేందుకు దరఖాస్తు చేసుకున్నా. ఉపకారవేతనానికి ఆమోదం లభించకపోవడంతో అఫ్గాలోనే ఉండిపోవాల్సి వచ్చింది. లేకపోతే వారం కిందటే హైదరాబాద్‌ వచ్చేవాడిని. ఇప్పుడు విమానాలు నిలిచిపోవడంతో చదువు కొనసాగించేందుకు ఎలా రావాలోనని ఆందోళన చెందుతున్నా.’’

- రహిముల్లా, అఫ్గాన్‌లోని విద్యార్థి.

ఈసారి ప్రవేశాలు ఉంటాయా?

గత కొన్నేళ్లుగా అఫ్గానిస్థాన్‌ నుంచి వచ్చే విద్యార్థుల సంఖ్య భారీగా పెరిగింది. ఉస్మానియా విశ్వవిద్యాలయానికి వచ్చే దరఖాస్తుల్లో 40-50శాతం ఆ దేశం నుంచే ఉంటున్నాయి. భారత సాంస్కృతిక సంబంధాల మండలి ఆధ్వర్యంలో అఫ్గాన్‌ జాతీయుల ప్రత్యేక ఉపకార వేతనాల పథకం కింద ఏటా 1000 మంది విద్యార్థులకు పీజీ, ఎంఫిల్‌, పీహెచ్‌డీ విద్యార్థులకు అందిస్తోంది.

ఇదీ చూడండి:తాలిబన్ల ఆక్రమణతో మళ్లీ చీకటిరాజ్యం!

ABOUT THE AUTHOR

...view details