తెలంగాణ

telangana

By

Published : Feb 18, 2021, 7:35 PM IST

ETV Bharat / state

న్యాయవాదుల హత్యను నిరసిస్తూ రాష్ట్రవ్యాప్తంగా లాయర్ల నిరసన

న్యాయవాద దంపతుల హత్యను నిరసిస్తూ.. రాష్ట్రవ్యాప్తంగా న్యాయవాదులు కదంతొక్కారు. విధులను బహిష్కరించిన లాయర్లు కోర్టు ప్రాంగణాల్లో నిరసనలు చేపట్టారు. దారుణ ఘటనపై వేగంగా దర్యాప్తు జరిపి దోషులను కఠినగా శిక్షించాలని నినదించారు.

advocates agitations in telangana against lawyer couple murder
న్యాయవాదుల హత్యను నిరసిస్తూ రాష్ట్రవ్యాప్తంగా లాయర్ల నిరసన

పెద్దపల్లి జిల్లాలో నడిరోడ్డుపై న్యాయవాద దంపతుల దారుణ హత్యను నిరసిస్తూ రాష్ట్రంలో లాయర్లు ఆందోళనలు చేపట్టారు. వామన్‌రావు దంపతుల హత్యను బార్‌కౌన్సిల్ ఖండించింది. హైకోర్టుతో పాటు రాష్ట్రవ్యాప్తంగా న్యాయస్థానాల్లో లాయర్లు విధుల బహిష్కరించారు. హైకోర్టులో లాయర్లు నిరసన ప్రదర్శన చేపట్టారు. ఫాస్ట్‌ ట్రాక్‌ కోర్టు ఏర్పాటుచేసి విచారణ వేగంగా పూర్తిచేయాలని డిమాండ్‌ చేశారు.

న్యాయవాదుల హత్యను నిరసిస్తూ రాష్ట్రవ్యాప్తంగా లాయర్ల నిరసన

విధులు బహిష్కరించి..

రంగారెడ్డి జిల్లా కోర్టు ముందు న్యాయవాదులు ధర్నా చేశారు. విధులు బహిష్కరించి రహదారిపై బైఠాయించి నిరసన తెలిపారు. లాయర్ల ధర్నాతో ఎల్బీనగర్-దిల్ సుఖ్ నగర్ మార్గంలో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. ఆందోళనకు భాజపా ఎమ్మెల్సీ రాంచందర్‌రావు మద్దతు తెలిపారు.

ఎవరున్నా.. శిక్షించాల్సిందే

న్యాయవాద దంపతుల హత్యను నాంపల్లి క్రిమినల్ కోర్టు బార్ అసోసియేషన్ ఖండించింది. చలో రాజ్‌ భవన్ బయలుదేరిన న్యాయవాదులను సైఫాబాద్ పోలీసు స్టేషన్ వద్ద పోలీసులు అడ్డుకున్నారు. ట్రాఫిక్ అంతరాయం కలగడంతో అదుపులోకి తీసుకున్నారు. సికింద్రాబాద్ సివిల్ కోర్టులోనూ న్యాయవాదులు ధర్నాకు దిగారు. దోషులను కఠినంగా శిక్షించాలంటూ గళమెత్తారు. పాతబస్తీలోని సిటీ సివిల్‌ కోర్టులో న్యాయవాదులు విధులు బహిష్కరించి నిరసన తెలిపారు. ఈ హత్యకు కేసులో ఎంత పెద్దవారున్నా కఠినంగా శిక్షించాలని లాయర్లు డిమాండ్‌ చేశారు.

లాయర్ల రక్షణకు ప్రత్యేక చట్టాలు

కూకట్ పల్లి, మల్కాజ్ గిరి కోర్టు సహా పాతబస్తీ సిటీసివిల్ కోర్టు ఎదుట న్యాయవాదులు నిరసనకు దిగారు. రాజేంద్రనగర్ కోర్టుల్లోనూ విధులు బహిష్కరించిన లాయర్లు ధర్నా చేశారు. దోషులను కఠినంగా శిక్షించి, న్యాయవాదుల రక్షణకు ప్రత్యేక చట్టాలు తేవాలని రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం బార్ అసోసియేషన్ డిమాండ్ చేసింది.

రాస్తారోకో..

జిల్లాల్లోనూ లాయర్లు ఆందోళనలు కొనసాగించారు. హన్మకొండలో న్యాయవాదులు విధులు బహిష్కరించి జిల్లా కోర్టు ఎదుట నిరసన తెలిపారు. నిర్మల్ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ధర్నాకు దిగిన అడ్వకేట్లు ఫిబ్రవరి 17ని బ్లాక్ డేగా పరిగణించాలంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. న్యాయం కోసం పోరాడేవారిపైనే దాడి చేయడం దారుణమని... ఖమ్మంలో న్యాయవాదులు బైఠాయించి నిరసన తెలిపారు. నిజామాబాద్ కోర్టు చౌరస్తాలో లాయర్లు మానవహారం చేపట్టి ర్యాలీ నిర్వహించారు. న్యాయవాదుల రక్షణ కోసం ప్రత్యేక చట్టం తీసుకురావాలని డిమాండ్ చేస్తూ... మంచిర్యాల, సిరిసిల్లలో రాస్తారోకో చేశారు. న్యాయవాదులకు రక్షణ కల్పించాలని మహబూబ్‌నగర్‌ బార్‌ అసోసియేషన్‌ నినదించింది.

ABOUT THE AUTHOR

...view details