Advent International Organization Invest in Telangana : హైదరాబాద్ కేంద్రంగా తన కార్యకలాపాలను మరింతగా విస్తరించేందుకు ప్రపంచ ప్రఖ్యాత ప్రవేట్ ఈక్విటీ పెట్టుబడిదారు సంస్థ అడ్వెంట్ ఇంటర్నేషనల్(Advent International Organization) ముందుకు వచ్చింది. ప్రగతి భవన్‌లో ఆ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ పంకజ్ పట్వారి, ఆపరేటింగ్ పార్ట్నర్ వైదీష్ అన్నస్వామి.. ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌తో సమావేశమై తమ సంస్థ పెట్టుబడులను, విస్తరణ ప్రణాళికలపై చర్చించారు. ఈ కార్యక్రమంలో పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్, తెలంగాణ లైఫ్ సైన్సెస్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శక్తి నాగప్పన్ తదితరులు పాల్గొన్నారు. మంత్రి కేటీఆర్ తన అమెరికా పర్యటనలో భాగంగా అడ్వెంట్ ఇంటర్నేషనల్ మేనేజింగ్ పార్ట్నర్ జాన్ మల్డొనాడొతో జరిగిన సమావేశంలో హైదరాబాద్ లైఫ్ సైన్సెస్, ఫార్మా ఈకో సిస్టం గురించి విస్తృతంగా చర్చించిన అంశాన్ని ఈ సమావేశంలో పంకజ్ పట్వారి ప్రత్యేకంగా ప్రస్తావించారు.
Companies Latest Investment in Telangana : లైఫ్ సైన్సెస్ రంగంలో 2 బిలియన్ డాలర్లు.. భారత కరెన్సీలో రూ.16,650 కోట్లు భారీ పెట్టుబడులు నగరంలో పెట్టేందుకు ముందుకు వచ్చింది. ఈభారీ పెట్టుబడి కేవలం భారతదేశంలోనే కాకుండా ఆసియా ఖండంలో ఈలైఫ్ సైన్సెస్ రంగంలో అతిపెద్ద పెట్టుబడిగా చెప్పవచ్చు. ఈ పెట్టుబడి ద్వారా తమ సంస్థ ఏపీఐ, కాంట్రాక్ట్ డెవలప్మెంట్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ రంగంలో అగ్రస్థానంలో నిలిచేందుకు దోహదపడుతుందని ఆ సంస్థ వెల్లడించింది. తమ పెట్టుబడితోపాటు జినోమ్ వ్యాలీలో 50 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ల్యాబ్ కూడా ఏర్పాటు చేస్తున్నట్లు అడ్వెంట్ ఇంటర్నేషనల్ తెలియజేసింది. అడ్వెంట్ ఇంటర్నెషనల్ సంస్థ హైదరాబాద్ సువెన్ ఫార్మాసుటికల్ కంపెనీలో దాదాపు రూ.9,589 కోట్లను పెట్టుబడిగా పెట్టనుంది. దీంతో పాటు తన 'కోహన్స్ ప్లాట్ఫారం' ద్వారా మరిన్ని సంస్థలలో పెట్టుబడులు పెట్టేందుకు నిర్ణయం తీసుకుంది. తన ఆర్‌ఏ కెమ్ ఫార్మా, జెడ్‌సీఎల్ కెమికల్స్, అవ్రా లాబరేటరీ వంటి సంస్థలకు హైదరాబాద్ తన కేంద్ర స్థానంగా ఎంచుకొనుంది.
Advent International Organization RS.16650 Crores Invest : నగరంలో అడ్వెంట్ ఇంటర్నేషనల్ తన పోర్ట్‌ఫోలియోను భారీగా విస్తరించుకోవడం పట్ల మంత్రి కేటీఆర్సంతోషం వ్యక్తం చేశారు.. తెలంగాణలో నూతన పెట్టుబడుల ద్వారా భారీ ఎత్తున విస్తరిస్తుండడం తెలంగాణ ఐటీ, లైఫ్ సైన్సెస్ ఈకో సిస్టం బలానికి నిదర్శనం అన్నారు. తెలంగాణ ఆవిర్భావం నాటి నుంచి లైఫ్ సైన్సెస్ ఈకోసిస్టమ్(Life Sciences Eco System) బలోపేతం చేసేందుకు ప్రభుత్వం తరఫున అవసరమైన అన్ని రకాల కార్యక్రమాలను చేపట్టామని, ముఖ్యంగా పరిశ్రమ భాగస్వాములతో కలిసి చేపట్టిన అనేక కార్యక్రమాలు ఈరోజు లైఫ్ సైన్సెస్ ఈకోసిస్ట్ వేగంగా వృద్ధి అయ్యేలా చేస్తున్నాయన్నాయని తెలిపారు. అడ్వెంట్ ఇంటర్నేషనల్ సంస్థ తెలంగాణ కేంద్రంగా మరింత పెద్ద ఎత్తున వృద్ధి సాధిస్తుందని, ఇందుకోసం సంస్ధకు అవసరమైన అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తామని మంత్రి చెప్పారు.