నగరాలు, ఓ మోస్తరు పట్టణాల్లో విస్తరిస్తున్న గేటెడ్ కమ్యూనిటీ సంస్కృతి ఆధునిక జీవనశైలికి అద్దం పడుతోంది. ఒకవైపు సకల సౌకర్యాలు... మరోవైపు భిన్నత్వంలో ఏకత్వాన్ని చాటే సామాజిక చైతన్యం వీటి ప్రత్యేకత. ఈ నివాసాల్లో ఒకప్పుడు జనం తమ అవసరాల కోసం బయటికి వెళ్లాల్సి వస్తే ఇప్పుడవన్నీ ఇంటి ముంగిట వాలుతున్నాయి. కారు సర్వీసు నుంచి కొరియర్ డెలివరీల వరకు నివాస సముదాయంలోనే ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసి మరీ సేవలు అందిస్తున్నాయి. వీటి కేంద్రంగా పలు సర్వీస్ సంస్థలు పుట్టుకొచ్చాయి. కొత్తగా వస్తున్న సముదాయాలను మరిన్ని ఆధునిక సౌకర్యాలతో తీర్చిదిద్దుతున్నారు. హౌస్‌కీపింగ్, సెక్యూరిటీతో పాటు అపార్ట్‌మెంట్ల అవసరాల కోసం ప్రత్యేక యాప్‌లు వచ్చాయి. ఆలయాలు, పిల్లల పార్కులు ఇతర హంగులు సరేసరి.. కొన్ని కమ్యూనిటీలు అంతర్జాతీయ గుర్తింపు కూడా పొందడం విశేషం.
గేటెడ్ కమ్యూనిటీల్లో ఒక్కోచోట 100 నుంచి 2 వేల నివాసాలు ఉంటున్నాయి. 400 మంది నుంచి 8 వేల మంది వరకు నివసిస్తున్నారు. భిన్న భాషలు.. సంస్కృతులు.. సంప్రదాయాలు అనుసరించే వందల మంది ఆత్మబంధువులుగా మారేందుకు కమ్యూనిటీలు వారధులుగా మారుతున్నాయి.
అంతా ఆన్‌లైన్...
అపార్ట్‌మెంట్ భవనాలు, విల్లాలను మొత్తం ఆన్‌లైన్ చేస్తున్నారు. ఇంట్లో ఉపయోగించే నీటి వినియోగం మొదలు, కరెంట్, గ్యాస్ వాడకం వరకు ఎప్పటికప్పుడు ఫోన్‌లోనే చూసుకునేలా ఏర్పాట్లు ఉంటున్నాయి. ఫలితంగా దుబారా తగ్గుతుంది. ఇందుకోసం పలు అపార్ట్‌మెంట్లు ఎల్‌మెజర్ వంటి యాప్‌లను ఉపయోగిస్తున్నాయి.
పెట్‌పార్క్‌లు..
ఇష్టంగా పెంచుకున్న శునకాలను ఇంటి నుంచి బయటికి తీసుకెళ్లి ఉదయం, సాయంత్రం అటుఇటు తిప్పడం కుదిరేది కాదని జంతుప్రేమికులు గతంలో చింతించేవారు. ఇప్పుడు హైదరాబాద్‌లోని కొన్ని విల్లా గెటేడ్ కమ్యూనిటీల్లో పెట్‌పార్క్‌లు వచ్చాయి. క్రమంగా ఈ సంస్కృతి నగరంలో విస్తరిస్తోంది.
అనుమతిస్తేనే లోపలికి..
ఆధునిక నివాస ప్రాంగణాల్లో కొన్నిచోట్ల విమానాశ్రయ తరహాలో భద్రత కల్పిస్తున్నారు. డెలివరీ బాయ్స్, పనిమనుషులు, బంధుమిత్రులు.. ఇలా రోజు వచ్చిపోయేవారి జాబితా కమ్యూనిటీల్లో పెద్దగానే ఉంటుంది. ఇదివరకు సెక్యూరిటీ గార్డులు రిజిస్టర్‌లో వీరి వివరాలు నమోదు చేసుకుని పంపించేవారు. ఇప్పుడంతా మొబైల్ యాప్‌లోనే చేస్తున్నారు. ఫ్లాట్, విల్లా యజమాని అనుమతి ఇవ్వందే లోపలికి ఎవరినీ పంపించరు. ఇందుకోసం చాలా కమ్యూనిటీలు ‘మైగేట్’, నో బ్రోకర్ హుడ్ తరహా యాప్‌లను వినియోగిస్తున్నాయి.
క్యూఆర్ కోడ్ గస్తీ...
భద్రతా సిబ్బంది రాత్రి గస్తీ తిరుగుతున్నారా లేదా అని పర్యవేక్షించడం కష్టం. అర్ధరాత్రి ఏయే ప్రాంతాల్లో గస్తీ అవసరమో అక్కడ క్యూఆర్ కోడ్‌ను గోడలపై ఉంచుతున్నారు. సెక్యూరిటీ సిబ్బంది ఆ ప్రాంతానికి వెళ్లినప్పుడు క్యూఆర్ కోడ్‌ను అపార్ట్‌మెంట్ మొబైల్ యాప్‌తో స్కాన్ చేస్తే చాలు. ఏ సమయంలో, ఏ ప్రాంతాల్లో అర్ధరాత్రిపూట గస్తీ తిరిగారనే వివరాలు కాలనీ సంక్షేమ సంఘాలకు చేరిపోతాయి.
*బిల్లుల చెల్లింపులు, ప్రతినెలా నిర్వహణ ఛార్జీల వసూలు, అపార్ట్‌మెంట్ లెక్కలు, ఫిర్యాదుల విభాగం వరకు ఒకే యాప్‌తో చేస్తున్నాయి.
*ఇంట్లో అగ్నిప్రమాదం, ఇతరత్రా అత్యవసరాల్లో మొబైల్‌లో ఎస్‌వోఎస్ మీట నొక్కగానే సెక్యూరిటీతోపాటు కుటుంబ సభ్యులకు సమాచారం వెళుతుంది.
వెండింగ్ యంత్రాలు..
నివాస సముదాయాల్లో సూపర్‌మార్కెట్లు, ఇతర దుకాణాలు ఉన్నప్పటికీ రాత్రి 11 తర్వాత మూతపడుతుంటాయి. బిస్కెట్ ప్యాకెట్లు, చాక్‌లెట్లు, శీతలపానీయాలు 24 గంటలపాటూ అందుబాటులోకి ఉండేలా గేటెడ్ కమ్యూనిటీల్లో వెండింగ్ యంత్రాలను ఏర్పాటు చేస్తున్నారు. నాణేలు, నోట్లతో పాటు పేటీఎం ద్వారా కూడా కొనుగోలు చేసేలా ఏర్పాట్లు ఉంటున్నాయి. వాలెట్ నుంచి చెల్లింపులు చేయగానే మొబైల్‌కు ఒక కోడ్ వస్తుంది. దానిని వెండింగ్ యంత్రంలో నమోదుచేస్తే మనకు కావాల్సిన పదార్థం బయటికి వస్తుంది.