ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయంలోని వివిధ డిప్లొమా కోర్సుల్లో 2020-21 విద్యా సంవత్సరానికి పాలిసెట్-2020 ర్యాంకుల ఆధారంగానే ప్రవేశాలు జరుగుతాయని అధికారులు స్పష్టం చేశారు. పాలిసెట్-2020 ప్రవేశ పరీక్షకు అభ్యర్థులందరూ విధిగా హాజరుకావాలన్నారు. వాయిదా పడిన పరీక్షను ఆగస్టులో నిర్వహించేందుకు సాంకేతిక విద్యా, శిక్షణ మండలి నిర్ణయించింది. ఇందుకు 200 రూపాయల ఆలస్య రుసుముతో దరఖాస్తు చేసుకునేందుకు ఈ నె 13 నుంచి 25వ తేదీ వరకు అవకాశం కల్పించింది.
ఫలితాలు వెల్లడించిన తర్వాత... వ్యవసాయ విశ్వవిద్యాలయం ప్రత్యేకంగా అడ్మిషన్ నోటిఫికేషన్ విడుదల చేయనుంది. ఆసక్తిగల అభ్యర్థులు వర్సిటీ అడ్మిషన్ నోటిఫికేషన్ ప్రకారం... విడిగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. వ్యవసాయ విశ్వవిద్యాలయం డిప్లొమా కోర్సుల్లో ప్రవేశం కోసం అభ్యర్థులు కనీసం నాలుగేళ్లు గ్రామీణ ప్రాంతాల్లో విధిగా చదవాలి.