Admissions Increases in TS govt schools : తెలంగాణలోని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల నమోదు గణనీయంగా పెరిగింది. సామాజిక, ఆర్థిక సర్వే ఇటీవలే ప్రకటించిన 2023 గణాంకాల ప్రకారం సంవత్సర కాల వ్యవధిలో దాదాపు 2 లక్షల మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల్లో చేరారు. గణాంకాల ప్రకారం రాష్ట్రంలో 2020-21 సంవత్సరంలో 41,220 గా ఉన్న ప్రభుత్వ పాఠశాలల సంఖ్య 2021-22 వ సంవత్సరానికి 41,369 కి పెరిగాయి. అంటే ఒకే సంవత్సరంలో 149 పాఠశాలు నూతనంగా ఏర్పడ్డాయి. 2020-21 లో ప్రభుత్వ బడుల్లో 60.40 లక్షల మంది విద్యార్ధులు ఉండగా ఆ సంఖ్య 2021-22 నాటికి 62.30 లక్షలకు పెరిగింది.
ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు, ఆంగ్ల మాధ్యమంలో బోధన, సోషియో, ఎమోషనల్ లర్నింగ్, సాఫ్ట్ స్కిల్స్ ప్రవేశ పెట్టడం వలన విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల్లో చేరేందుకు మొగ్గు చూపుతున్నారు. ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ బడులు రూపొందుతుండటం ఇందుకు కారణం. గత విద్యా సంవత్సరం 2021-22లో ప్రైవేట్ పాఠశాలలతో పోల్చితే ప్రభుత్వ బడుల్లో అధికంగా అనగా 6.30 శాతం ప్రవేశాలు నమోదయ్యాయి.