తెలంగాణ

telangana

ETV Bharat / state

ఉద్యోగాలు భర్తీచేసే TSPSCలో ఉద్యోగుల కొరత.. పాలనాపరమైన వైఫల్యాల వల్లే పేపర్ లీకేజ్..! - TSPSC Paper Leak Case Failures

TSPSC Paper Leak Case news: రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ ప్రశ్నపత్రాల లీకేజీ వెనక పరిపాలనపరమైన, విధానపరమైన వైఫల్యాలు ప్రధాన కారణంగా కనిపిస్తున్నాయి. పరిమిత సంఖ్యలో సిబ్బంది, బలహీనమైన ఐటీ వ్యవస్థ అక్రమార్కులకు వరంగా మారింది. సాంకేతికతలో లోపాలు, రక్షణ లేమిని ఆసరాగా చేసుకుని కమిషన్‌లో పనిచేస్తున్న సిబ్బంది ప్రశ్నాపత్రాలను లీక్‌ చేసినట్లు దర్యాప్తులో వెల్లడైంది. అదనపు సిబ్బంది, పటిష్ఠమైన ఐటీ కేంద్రంతో పాటు ఇతర లోపాలపై ముందుగానే మేల్కొని ఉంటే ఈ పరిస్థితికి దారితీసేదికాదని నిపుణులు పేర్కొంటున్నారు.

TSPSC
TSPSC

By

Published : Mar 17, 2023, 12:34 PM IST

TSPSCలో కనిపిస్తున్న వైఫల్యాలు.. పరిమిత సిబ్బందే అక్రమార్కులకు వరంగా మారిందా..!

TSPSC Paper Leak Case news : టీఎస్​పీఎస్​సీ రాజ్యాంగబద్ధమైన సంస్థ. యూపీఎస్​సీ తరహాలోనే ఇక్కడి కార్యకలాపాలు ఉంటాయి. ప్రతి సెక్షన్‌ కార్యకలాపాలు అత్యంత గోప్యంగా ఉండాలి. కంప్యూటర్‌ ఆధారిత పరిపాలన కావడంతో పటిష్ఠమైన నెట్‌వర్క్‌ అవసరం. కానీ టీఎస్​పీఎస్​సీలో నెట్‌వర్క్‌ అత్యంత బలహీనంగా ఉందని వెల్లడైంది. ఐటీ వ్యవస్థ కోసం ప్రభుత్వం అంతంతమాత్రంగా నిధులు కేటాయిస్తోంది. పొరుగుసేవల ఉద్యోగుల జీతాలకు కేటాయింపులు తగ్గించడంతో.. రాష్ట్ర సాంకేతిక సేవల సంస్థ ఆరుగురి స్థానంలో నలుగురితోనే పనిచేయిస్తోంది.

TSPSC failed to secure question Papers : ఎవరైనా ఉద్యోగి ల్యాన్‌లో ఎప్పుడు లాగిన్‌ అయ్యాడు? ఎప్పుడు బయటికి వచ్చాడు? ఏయే దస్త్రాలను పరిశీలించాడు? తదితర వివరాలన్నీ తప్పనిసరిగా తెలిసేలా రక్షణ ఏర్పాట్లు ఉండాలి. కానీ, కమిషన్‌లో ఈ ఏర్పాట్లేమీ లేవు. దీనిని ఆసరాగా చేసుకుని ఐపీ అడ్రస్‌లు మార్చి కాన్ఫిడెన్షియల్‌ సెక్షన్‌ నుంచి ప్రశ్నపత్రాలను దొంగలించారు. పలు సంస్థలు, బ్యాంకుల్లో ఉద్యోగులు బయోమెట్రిక్‌ లేదా మొబైల్‌ నంబరుకు వచ్చే ఓటీపీని నమోదు చేసిన తరువాతే కంప్యూటర్‌లో లాగిన్‌ అయ్యేందుకు యాక్సెస్‌ ఇస్తున్నాయి.

TSPSC failed to stop Paper Leakage : అలాంటిది లక్షల మంది నిరుద్యోగ యువత భవితవ్యం ఆధారపడి ఉన్న కమిషన్‌లో మాత్రం ఇలాంటి ఏర్పాట్లు లేవు. కాన్ఫిడెన్షియల్‌ సెక్షన్‌ నిర్వహిస్తున్న చోట సీసీటీవీ కెమెరాలు, బయోమెట్రిక్‌ నమోదు చేసే వ్యవస్థ లేకపోవడమూ నిందితులకు ఇది వరంగా మారింది. బయోమెట్రిక్‌ వ్యవస్థ ఉంటే పాస్‌వర్డ్‌ దొంగిలించేందుకు అవకాశాలు ఉండేవి కాదని నిపుణులు అంటున్నారు. పరీక్షల నిర్వహణలో లోటుపాట్లపై నాలుగేళ్ల క్రితమే ప్రభుత్వానికి పబ్లీక్​ సర్వీస్​ కమీషన్​ నివేదిక ఇచ్చింది. ఉద్యోగుల కొరతతో ప్రస్తుతం ఉన్నవారిపై తీవ్ర పనిభారం పడుతోందని.. అదనపు సిబ్బంది కావాలని కోరుతూ టీఎస్​పీఎస్​సీ నివేదిక ఇచ్చింది.

కేరళ కమిషన్‌లో 1,600 మంది పనిచేస్తున్నారని, ఇదే తరహాలో టీఎస్​పీఎస్​సీకి సిబ్బందిని కేటాయించాలని, పలు ఇతర సంస్కరణలు చేపట్టాలనీ కోరింది. కనీసం 341 మంది ఉద్యోగులు అవసరమని తెలిపింది. అయితే 166 ఉద్యోగులను మాత్రమే సర్కారు కేటాయించింది. ప్రస్తుతం 106 మంది పనిచేస్తున్నారు. వీరిలో నాలుగో తరగతి ఉద్యోగులతో కలిపి 83 మంది మాత్రమే ప్రభుత్వ ఉద్యోగులు ఉండగా మిగతా సిబ్బంది పొరుగుసేవల కింద పనిచేస్తున్నారు. నియామకాల్లో కీలకమైన నోటిఫికేషన్, పరీక్షల నిర్వహణ, కాన్ఫిడెన్షియల్‌ విభాగం, వెరిఫికేషన్లు, పోస్టింగుల విభాగాల్లో ఉద్యోగుల కొరత ఎక్కువగా ఉంది.

30 మంది ఉద్యోగులు మాత్రమే ఈ విభాగాల పనులు చూస్తున్నారు. తక్కువ మంది ఉండటంతో ప్రతిరోజూ రాత్రి 12 గంటల వరకు కార్యాలయాల్లోనే విధులు నిర్వహించాల్సి వస్తోందని టీఎస్​పీఎస్​సీ తెలిపింది. ప్రశ్నపత్రాల లీకేజీ నేపథ్యంలో పరిపాలన విభాగాన్ని ప్రక్షాళన చేయాలని కమీషన్​ నిర్ణయించింది. ప్రస్తుతం నిర్వహిస్తున్నవారి బాధ్యతలను మార్చాలని భావిస్తోంది.

సిబ్బందికి అవగాహన తరగతులు నిర్వహిస్తోంది. కాన్ఫిడెన్షియల్‌ సెక్షన్‌ను మరింత పటిష్ఠం చేయనుంది. ప్రశ్నపత్రాల లీకేజీకి పాల్పడేవారికి కఠిన శిక్షలు పడేలా సంస్కరణలు తీసుకురావాలనీ ఆలోసిస్తోంది. వివిధ రాష్ట్రాల్లో పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్ల పనితీరు, విధానాలను కమిషన్‌ పరిశీలిస్తోంది. సాంకేతికంగా, పరిపాలనాపరంగా చేపట్టాల్సిన చర్యలు, విభాగాల విభజన గురించి చర్చిస్తోంది.

TSPSC పేపర్ లీక్‌ కేసు.. ప్రవీణ్ పెన్‌డ్రైవ్‌లో మరో 3 ప్రశ్నాపత్రాలు..!

TSPSC పేపర్ లీకేజీ.. రాష్ట్రవ్యాప్తంగా కొనసాగుతున్న ఆందోళనలు.. రోడ్డెక్కిన విద్యార్థులు

ఇద్దరమ్మాయిల ప్రేమాయణం.. మధ్యలో యువకుడి ఎంట్రీ.. కట్​ చేస్తే...

ABOUT THE AUTHOR

...view details