aditya thackrey meets ktr in Hyderabad: యువనేతలు మంత్రి కేటీఆర్, మాజీ మంత్రి ఆదిత్య ఠాక్రే హైదరాబాద్‌లో ఇవాళ భేటీ అయ్యారు. మహారాష్ట్ర నుంచి వచ్చిన ఆదిత్య.. టీ-హబ్‌లో కేటీఆర్‌తో సమావేశమై.. టీ-హబ్ ప్రత్యేకతల గురించి వివరాలు తెలుసుకున్నారు. టీ-హబ్ పనితీరు గురించి, దానికి సంబంధించిన అంశాల గురించి పూర్తి వివరాలను కేటీఆర్‌ను అడిగి తెలుసుకున్నారు ఆదిత్య. అయితే ఈ భేటీలో కేవలం టీ-హబ్ గురించే కాదు జాతీయ రాజకీయాల గురించి ఇరువురు నేతలు చర్చించినట్లు తెలుస్తోంది.
యువనేతల భేటీ:ఠాక్రే నేతృత్వంలోని బృందం హైదరాబాద్‌లో టీ-హబ్‌ను సందర్శించింది. స్వయంగా మంత్రి కేటీఆర్ వీరికి టీ హబ్‌ను చూపించారు. అర్బనైజేషన్ గురించి, వివిధ పథకాల గురించి ఠాక్రే బృందం తెలుసుకుంది. టీ-హబ్‌లోని అంకురాలు, ఇన్నోవేషన్లను పరిశీలించారు. హైదరాబాద్ టీహబ్‌లో స్టార్టప్‌లు, వాటి ఆవిష్కర్తలు, ఆలోచనా పరులు అద్భుతమని ఆదిత్య ఠాక్రే ప్రశంసించారు. సుస్థిరత, పట్టణీకరణ, టెక్నాలజీపై కేటీఆర్‌తో యువనేత ఆదిత్య ఠాక్రే చర్చించారు, వాటికి సంబంధించిన వివరాలన్నీ అడిగి తెలుసుకున్నారు.
ఆసక్తికర అంశాలపై చర్చ: దేశాభివృద్ధిలో టెక్నాలజీ పాత్రపై, దాని ప్రాముఖ్యత, అవసరం గురించి ఇరు యువ నేతలు చర్చించారు. మంత్రి కేటీఆర్‌తో ఎప్పుడు సమావేశమైనా అది అద్భుతంగా, ప్రోత్సాహభరితంగా సాగుతుందని ఆదిత్య ఠాక్రే పేర్కొన్నారు. ఇరువురికి ఆసక్తికర అంశాలైన సుస్థిరత, పట్టణీకరణ, టెక్నాలజీ, దేశాభివృద్ధిలో వాటి పాత్ర తదితర అంశాలపై భేటీలో చర్చించినట్లు ట్వీట్ చేశారు.