తెలంగాణ

telangana

ETV Bharat / state

మ్యుటేషన్‌ పూర్తయింది.. పాసు పుస్తకం రాలేదండీ! - Dharani portal problems

ధరణి పోర్టల్‌ ద్వారా రిజిస్ట్రేషన్‌, మ్యుటేషన్‌ సేవలు పొందిన రైతులకు ఇప్పుడు కొత్త చిక్కులు ఎదురవుతున్నాయి. చిరునామాలు సరిగా లేకపోవడంతో కొత్త పాసుపుస్తకాలు పొందడం వారికి దుర్లభంగా మారింది. ఈ విషయంలో తమకేమీ సంబంధం లేదని తహసీల్దార్లు చెబుతుండటంతో ఎవర్ని సంప్రదించాలో తెలియక అన్నదాతలు అయోమయానికి గురవుతున్నారు.

Address option not available in Dharani portal
మ్యుటేషన్‌ పూర్తయింది.. పాసు పుస్తకం రాలేదండీ!

By

Published : Dec 9, 2020, 7:02 AM IST

గత నెల రెండో తేదీన ప్రారంభమైన పోర్టల్‌ ద్వారా ఇప్పటివరకు 90 వేలకుపైగా లావాదేవీలు పూర్తయ్యాయి. వీరందరికీ కొత్త పాసుపుస్తకాలు జారీ కావాల్సి ఉంది. మ్యుటేషన్‌ పూర్తయిన వారం పదిరోజుల్లోనే కొరియర్‌ ద్వారా కొత్త పాసుపుస్తకం లబ్ధిదారుల ఇంటికి పంపుతామని ప్రభుత్వం మార్గదర్శకాల్లో పేర్కొంది. ధరణి పోర్టల్లో మాత్రం అందుకు సరిపడా వివరాలు లేకపోవడం ప్రస్తుతం గందరగోళానికి కారణమైంది.

ఎక్కడికి పంపుతారో?

ధరణలో ఎక్కడా రైతు తాలూకూ పోస్టల్‌ చిరునామా ఐచ్ఛికం లేదు. భూమి ఎక్కడ ఉందనే వివరాల దగ్గర సర్వే నంబరు, గ్రామం, మండలం, జిల్లా వివరాలు మాత్రమే ఉన్నాయి. మ్యుటేషన్‌ ప్రక్రియ పూర్తయ్యాక తహసీల్దారు ఇచ్చే తుది పత్రాల్లో(పాసు పుస్తకానికి సంబంధించినవి)నూ పూర్తిస్థాయి చిరునామా లేదు. రైతు పేరు, భూమి ఉన్న గ్రామం పేరు, దాని దిగువన లబ్ధిదారు నివాసం ఉండే గ్రామం, పిన్‌కోడ్‌ మాత్రమే ఉన్నాయి. ఉదాహరణకు హైదరాబాద్‌లో నివసించే వ్యక్తి కరీంనగర్‌ జిల్లాలో భూమి కొనుగోలు చేశాడనుకుంటే అతని సంబంధించిన గ్రామం స్థానంలో హైదరాబాద్‌ అని మాత్రమే సూచిస్తోంది. కేవలం ఆ వివరాలతో పాసుపుస్తకం నేరుగా రైతు ఇంటికి బట్వాడా అవుతుందన్న నమ్మకం లేదని అధికారులు అభిప్రాయపడుతున్నారు.

‘పాసు పుస్తకాలు ఎప్పుడొస్తాయంటూ రైతులు మమ్మల్ని సంప్రదిస్తున్నారు. రిజిస్ట్రేషన్‌, మ్యుటేషన్లు తప్ప వేరే వివరాలేవీ మాకు తెలియవని చెబుతున్నా వారు నమ్మడం లేదు. పైగా మాతో వాదనకు దిగుతున్నారు. ప్రభుత్వం ధరణి పోర్టల్‌లో లబ్ధిదారుకు సంబంధించిన పూర్తి చిరునామా పేర్కొనేలా ఐచ్ఛికం ఏర్పాటు చేస్తే తప్ప ఈ సమస్య పరిష్కారం కాదు’ అని పలువురు తహసీల్దార్లు పేర్కొన్నారు. గత నెల రెండో తేదీ నుంచి మ్యుటేషన్లు పొందిన వారిలో సింహభాగం మందికి ఇప్పటికీ డిజిటల్‌ పాసు పుస్తకాలు అందకపోవడాన్ని వారు ఉదహరిస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details