సామాజిక మాధ్యమాల్లో తనపై దుష్ప్రచారం చేశారంటూ సినీ నటి సమంత(actress samantha) నిన్న కూకట్‌పల్లి కోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. సమంత పిటిషన్‌పై త్వరగా విచారణ చేపట్టాలని ఆమె తరఫు న్యాయవాది కోర్టును కోరారు. సెలబ్రిటీలను కించపరిచే వారిపై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. దీనిపై స్పందించిన న్యాయమూర్తి.. కోర్టు ముందు అందరూ సమానమేనన్నారు. సామాన్యులైనా, సెలబ్రిటీలైనా కోర్టు ముందు ఒక్కటేనని స్పష్టం చేశారు. వ్యక్తిగత జీవితం విశేషాల ఫొటోలు, విడియోలను ఎప్పటికప్పుడు విరివిగా సామాజిక మాధ్యమాల్లో పంచుకునే సెలెబ్రిటీలే... తిరిగి పరువు నష్టం కేసులు వేయటమేంటని కోర్టు వ్యాఖ్యానించింది.
తన ప్రతిష్టకు భంగం కలిగించేలా దుష్ప్రచారం చేయకుండా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలన్న నటి సమంత(actress samantha) పిటిషన్‌పై నిర్ణయాన్ని కూకట్ పల్లి కోర్టు నేడు తీర్పు ఇవ్వనుంది. పిటిషన్ విచారణ అర్హతపై గురువారం వాదనలు జరిగాయి. క్షమాపణల కోసం ప్రతివాదులకు నోటీసులు ఇవ్వకుండా నేరుగా కోర్టుకు ఎందుకు వచ్చారని న్యాయస్థానం ప్రశ్నించింది. నోటీసులు ఇవ్వకుండా నేరుగా పిటిషన్ వేసేందుకు చట్టం అనుమతిస్తోందని న్యాయవాది బాలాజీ యలమంజిలి వాదించారు.
తనపై దుష్ప్రచారం చేస్తున్నారంటూ వైద్యుడు, విశ్లేషకుడు డాక్టర్ సీఎల్ వెంకట్రావుతో పాటు రెండు యూట్యూబ్ ఛానెళ్లపై నటి సమంత బుధవారం కూకట్‌పల్లి కోర్టులో పరువునష్టం దావా దాఖలు చేశారు. అక్కినేని నాగచైతన్యతో తన వైవాహిక జీవితంపై సుమన్ టీవీ, తెలుగు పాపులర్ టీవీ యూట్యూబ్ ఛానెళ్లలో వెంకట్రావు తప్పుడు ప్రచారం చేశారని పిటిషన్లో సమంత పేర్కొన్నారు. తన వ్యక్తిగత ప్రతిష్ఠకు భంగం కలిగించేలా అబద్ధపు వ్యాఖ్యలు చేశారన్నారు. మీడియా, పత్రికల ద్వారా బేషరతుగా బహిరంగ క్షమాపణలు చెప్పేలా ఆదేశించాలని కోర్టును సమంత(actress samantha) కోరారు.
ఇటీవలే విడిపోయిన చై-సామ్..
తెలుగు చలన చిత్రపరిశ్రమలో ప్రేమించి పెళ్లి చేసుకున్న అక్కినేని నాగచైతన్య, సమంతలు తమ బంధానికి ముగింపు పలికారు. భార్యభర్తలుగా విడిపోతున్నట్లు సామాజిక మాద్యమాల ద్వారా అధికారికంగా ప్రకటించారు. పదేళ్లుగా తమ స్నేహం కొనసాగినందుకు అదృష్టవంతులమని పేర్కొన్న చైతన్య, సమంత.. ఆ స్నేహమే తమ వివాహ బంధానికి కీలకంగా నిలిచిందన్నారు. అయితే విడిపోడానికి సరైన కారణాన్ని వెల్లడించని వీరిద్దరూ.. ఈ క్లిష్ట పరిస్థితుల్లో తమ వ్యక్తిగత స్వేచ్ఛకు అభిమానులు, శ్రేయోభిలాషులు, మీడియా సహకరించాలని విజ్ఞప్తి చేశారు. భవిష్యత్లో తమ స్నేహ బంధం కొనసాగుతుందని తెలిపారు.