సినిమాలో విలాన్ అయినా నిజ జీవితంలో హీరోగా వెలుగొందుతున్నారు నటుడు సోనూసూద్. పేదవారికి అపన్నహస్తాన్ని అందిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. ఈ విలక్షణ నటుడు మరోసారి హైదరాబాదీల మనసు గెలుచుకున్నారు. బంజారాహిల్స్ రోడ్ నెంబరు 3 మీదుగా వెళ్తూ రోడ్డు పక్కన మొసంబీ జ్యూస్ బండి వద్ద ఆగారు. అక్కడ కొద్దిసేపు జ్యూస్ చేసి వినియోగదారులకు విక్రయించారు. చిరు వ్యాపారుల్ని ప్రోత్సహించాలని కోరుతూ వీడియోను ట్విట్టర్‌లో పోస్టు చేశారు. దీనిపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. కుటుంబ ఆర్థిక స్థితి సరిగా లేక సివిల్స్పై ఆశ ఉన్నవారి కోసం ప్రత్యేక స్కాలర్షిప్ ప్రోగ్రామ్ను ఇప్పటికే సోనూ ఏర్పాటు చేశారు. 'సంభవం' అనే ఉచిత స్కాలర్షిప్ ప్రోగ్రామ్ కోసం అభర్థులు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. కరోనా సమయంలో వలస కూలీలు సొంత ప్రాంతాలకు వెళ్లేందుకు బస్సులు కూడా ఏర్పాటు చేశారు.
కరోనా సమయంలో అనేక సేవ కార్యక్రమాలు
ఏడాది క్రితం ఆంధ్రప్రదేశ్ ట్రాక్టర్ లేక మనుషులే కాడెడ్లై పొలం దున్ని విషయాన్ని తెలుసుకున్న సోనూ ఆ రైతు కుటుంబానికి ట్రాక్టర్ కొనిచ్చారు. ఇప్పుడు దేశంలోని పలు ప్రాంతాల్లో ఆక్సిజన్ ప్లాంట్లను ఏర్పాటు చేస్తున్నారు. వ్యాక్సిన్ ప్రక్రియలో గ్రామీణ భారతానికి అండగా నిలిచేందుకు 'Coverg' పేరుతో ఓ కొత్త కార్యక్రమం చేట్టారు. టీకాల కోసం రిజిస్టర్ చేసుకోవడంలో ఇబ్బందులు పడుతున్న వారికి సాయం చేయడానికి వాలంటీర్లు స్వయంగా ముందుకొచ్చేలా దీన్ని రూపొందించారు. ఇలా ఎవరు ఏది అడిగిన లేదనకుండా, కాదనకుండా ఇస్తూ పేదల పాలిట దేవుడిగా నిలుస్తున్నారు సోనూసూద్. సోనూసూద్ సహాయాన్ని యావత్ దేశం ప్రశంసిస్తోంది.