తెలంగాణ

telangana

ETV Bharat / state

నవ్వుల మల్లి నట జాబిల్లి.. మల్లికార్జున రావు - Actor Mallikarjuna rao

పోషించిన పాత్రలతోనే ప్రేక్షకుల హృదయాల్లో గుర్తుండిపోయిన అరుదైన నటుడు మల్లికార్జునరావు. ‘అన్వేషణలో పులిరాజుగా అయినా... ‘లేడీస్‌ టైలర్​లో బట్టల సత్యంగానైనా... ఒదిగిపోయి ఆ పాత్రల పేర్లతోనే చలామణీ అయ్యారు మల్లికార్జునరావు. హలో బ్రదర్‌’, ‘బద్రి’, ‘తమ్ముడు’ సినిమాల్లో ఆయన పండించిన వినోదాలు ప్రేక్షకులకు ఇప్పటికీ గుర్తే.

Actor Mallikarjuna rao Memorial day special story in telugu
నవ్వుల మల్లి... నట జాబిల్లి

By

Published : Jun 24, 2020, 2:08 PM IST

మల్లికార్జునరావు అక్టోబరు 10, 1960లో అనకాపల్లిలో జన్మించారు. పాఠశాల దశ నుంచే నాటకాలతో అనుబంధం ఏర్పరుచుకొన్న ఆయన ఏకపాత్రాభినయం పాత్రలతో నటనమీద పట్టు పెంచుకొన్నారు. భమిడిపాటి రాధాకృష్ణ రాసిన ‘లెక్కలు తెచ్చిన చిక్కులు’ ఆయనకి తొలి నాటకం. రంగస్థలంపై నటుడిగా నిలబెట్టింది మాత్రం ‘పలుకే బంగారమాయె’. ఇందులో నిర్మాత వేషం మల్లికార్జునరావుకి ఎంతో గుర్తింపునిచ్చింది. అనకాపల్లిలోనే ఎ.ఎమ్‌.వి.ఎమ్‌ ఆసుపత్రిలో కొన్నాళ్లు ఉద్యోగం చేశారు. అక్కడి ట్రేడ్‌ యూనియన్‌కి నాయకత్వం వహించారు. ప్రముఖ నటులు రావు గోపాలరావు సహకారంతో చిత్ర పరిశ్రమలోకి ప్రవేశించిన ఆయన 1972లో ‘తులసి’ చిత్రంలో ఓ చిన్న పాత్ర పోషించారు. పార్వతీ పరమేశ్వరులు అనే చిత్రానికి సహాయ దర్శకుడిగా కూడా పనిచేశారు. ప్రముఖ దర్శకుడు వంశీతో పరిచయం తర్వాత మల్లికార్జున రావు జీవితం మలుపు తిరిగింది. వంశీ చిత్రం ‘మంచుపల్లకీ’లో చిన్న పాత్ర పోషించారు. ‘అన్వేషణ’లో పులిరాజుగా చక్కటి అభినయం ప్రదర్శించారు.

గుర్తింపు తెచ్చిన బట్టల సత్యం

ఇక ‘లేడీస్‌ టైలర్‌’లో పోషించిన బట్టల సత్యం పాత్ర తర్వాత వెనుదిరిగి చూసుకోవల్సిన అవసరం రాలేదు. 350 పై చిలుకు చిత్రాల్లో నటించిన మల్లికార్జునరావు ‘తమ్ముడు’లో పాత్రకిగానూ ఉత్తమ సహనటుడిగా నంది పురస్కారం అందుకొన్నారు. ‘ఏప్రిల్‌ ఒకటి విడుదల’, ‘కనకమహాలక్ష్మి రికార్డింగ్‌ డ్యాన్స్‌ ట్రూపు’, ‘హలో బ్రదర్‌’, ‘అలీబాబా అరడజను దొంగలు’, ‘ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు’, ‘బద్రి’, ‘ఔను వాళ్లిద్దరూ ఇష్టపడ్డారు’, ‘ఎవడిగోల వాడి’, ‘మా ఆయన సుందరయ్య’ తదితర చిత్రాలు మల్లికార్జున రావుకి ఎంతో పేరు తీసుకొచ్చాయి. తన సంభాషణల శైలిలో ఉత్తరాంధ్ర యాసని మేళవించి ప్రేక్షకుల్ని ఆకట్టుకొనేవారు. గ్రామీణ నేపథ్యమున్న పాత్రల్లో ఒదిగిపోయారు.

లుకేమియా వ్యాధితో మరణం

మల్లికార్జునరావు 57 ఏళ్ల వయసులో 24 జూన్‌ 2008న లుకేమియా వ్యాధితో హైదరాబాద్‌లో తుదిశ్వాస విడిచారు. ఆయన తెలుగుదేశం పార్టీ సాంస్కృతిక విభాగానికి ఉపాధ్యక్షుడిగా పనిచేశారు. మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌కి ప్రధాన కార్యదర్శిగా మూడుసార్లు పనిచేశారు. మల్లికార్జునరావుకి ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు. ఈ రోజు మల్లికార్జునరావు వర్థంతి.

ABOUT THE AUTHOR

...view details