చేప, రొయ్య పిల్లల్లో వ్యాధి కారకాలు ఉన్నట్లు తేలితే లైసెన్సుదారుడిపై చర్యలతో పాటు.. వాటికి చెల్లించిన పూర్తి మొత్తాన్ని రైతుకు వెనక్కి ఇచ్చేలా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆర్డినెన్స్ తెచ్చింది. జరిమానా కూడా విధించే అవకాశం ఉంది. ఈ మేరకు ఆక్వాకల్చర్ సీడ్ యాక్ట్‌కు ఏపీ ప్రభుత్వం సవరణలు చేసింది. ఇందులో భాగంగా రాష్ట్రస్థాయిలో ఏర్పాటయ్యే చేప పిల్లల పెంపకపు కమిటీకి ఛైర్మన్‌గా మత్స్యశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, సభ్య కార్యదర్శిగా కమిషనర్ ఉంటారు. హ్యాచరీ, బ్రూడర్ కేంద్రాలు, చేప పిల్లల యూనిట్లు తప్పనిసరిగా లైసెన్సు తీసుకోవాలి. ధ్రువీకరించని చేప, రొయ్యపిల్లల్ని విక్రయించకూడదు. కొత్తగా హ్యాచరీ, లార్వా, బ్రూడర్ కేంద్రాలు ఏర్పాటు చేయాలనుకుంటే.. రిజిస్టరు చేసుకుని లైసెన్సుకు దరఖాస్తు చేయాలి. అన్నీ సక్రమంగా ఉంటే 15 రోజుల్లో అనుమతి ఇస్తారు.
అనుమతి లేకుండా చేపల మేత అమ్మకూడదు
చేపల మేతలో యాంటీబయోటిక్, ఫార్మకోలోజికల్ పదార్థాలు ఉండకూడదని ఏపీ ప్రభుత్వం స్పష్టం చేసింది. ఆ మేరకు సంచిపై ధ్రువీకరించాలని సూచించింది. వీటితోపాటు లైసెన్సులేకుండా చేపలు, రొయ్యల మేత వ్యాపారం చేసినా, అనుమతించని, కాలం చెల్లిన దాణాను విక్రయించినా చర్యలు తీసుకుంటారు. చేపల మేత తయారీ, పంపిణీ, పర్యవేక్షణపై ప్రభుత్వం ఆర్డినెన్స్ జారీచేసింది.