గాంధీ ఆసుపత్రిలో తనపై అత్యాచారం జరిగినట్లు చిలకలగూడ పోలీస్‌స్టేషన్‌లో మహిళ ఫిర్యాదుపై పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. ముఖ్యంగా తన సోదరి కనిపించకుండా పోయిందని, ఆమెను కూడా అపహరించారంటూ మహిళ చెప్పడంతో గాంధీ పరిసర ప్రాంతాల్లోని సీసీటీవీ ఫుటేజీని పోలీసులు తనిఖీ చేస్తున్నారు.
ఈ నెల 4న చికిత్స కోసం మహబూబ్‌నగర్ జిల్లా నుంచి ఓ మహిళ, తన సోదరి భర్త నర్సింహులు చికిత్స నిమిత్తం గాంధీ ఆస్పత్రిలో చేరారు. వారి ప్రాంతానికే చెందిన దూరపు బంధువు ఉమా మహేశ్వర్ అనే వ్యక్తి గాంధీ ఆసుపత్రిలో ఎక్స్ రే విభాగంలో టెక్నీషియన్‌గా పని చేస్తున్నాడు. అతని ద్వారానే ఆస్పత్రిలో నర్సింహులును అడ్మిట్ చేశారు. ఈ నెల 7న వైద్యులు నర్సింహులును మరో వార్డుకు పంపారు. ఆరోగ్యం కుదుటపడటంతో 11న నర్సింహులు ఒక్కడే డిశ్ఛార్జి అయి బయటికి వచ్చాడు. అతని భార్య, బాధిత మహిళ కనపడకుండాపోయారు. దీంతో నర్సింహులు చుట్టు పక్కల గాలించి.. కనిపించకపోవడంతో ఇంటికి వెళ్లిపోయాడు.
గాంధీ మార్చురీ సమీపంలో వివస్త్రగా..
ఈ నెల 15న గాంధీ మార్చురీ సమీపంలో బాధిత మహిళ తాగిన మైకంలో వివస్త్రగా పడి ఉంది. గమనించిన కొందరు మహేశ్వర్ దృష్టికి తీసుకువచ్చారు. దీంతో మహేశ్వర్ నర్సింహులు కుమారుడికి సమాచారం అందించాడు. నర్సింహులు కుమారుడు వచ్చి బాధిత మహిళను అడగ్గా.. తనపై కొందరు గుర్తుతెలియని వ్యక్తులు అత్యాచారం చేశారని వాపోయింది. మహబూబ్‌నగర్ జిల్లాకు వెళ్లి పోలీసులను ఆశ్రయించగా.. చిలకలగూడ పోలీసులకు ఫిర్యాదు ఇవ్వాలని వారు సూచించారు. దీంతో బాధిత మహిళ కుటుంబసభ్యులతో కలిసి నేడు చిలకలగూడ పోలీసులకు ఫిర్యాదు చేసింది.