TSPSC paper Lekage Case update: ప్రశ్నాపత్రాల లీకేజీ కేసులో నిందితులుగా ఉన్న ప్రవీణ్, రాజశేఖర్ రెడ్డిలను నాంపల్లి కోర్టు ఈడీ కస్టడీకి అనుమతించింది. రెండు రోజుల కస్టడీకి అనుమతిస్తూ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నెల 17, 18వ తేదీల్లో ఇద్దరు నిందితులను ఈడీ అధికారులు ప్రశ్నించనున్నారు. చంచల్ గూడ జైల్లోనే ఇద్దరు నిందితుల నుంచి ఈడీ అధికారులు వాంగ్మూలం తీసుకోనున్నారు. ఈ మేరకు తగిన ఏర్పాట్లు చేయాలని చంచల్ గూడ జైలు పర్యవేక్షకుడిని నాంపల్లి కోర్టు ఆదేశించింది.
TSPSC paper Lekage Case: టీఎస్‌పీఎస్సీ పేపర్ లీకేజీ నిందితులకు ఈడీ కస్టడీ - టీఎస్‌పీఎస్సీ
18:59 April 15
ఈడీ కస్టడీకి టీఎస్‌పీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజ్ కేసు నిందితులు
ప్రశ్నాపత్రాల లీకేజీ కేసులో ప్రవీణ్, రాజశేఖర్ రెడ్డితో పాటు మరో ఏడుగురిని సిట్ అధికారులు గత నెల 13వ తేదీన అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. ప్రవీణ్, రాజశేఖర్ రెడ్డి ఇచ్చిన సమాచారం ఆధారంగా మరికొంత మందిని సిట్ అధికారులు అరెస్ట్ చేశారు. ప్రశ్నాపత్రాల లీకేజీ కేసులో సిట్ అధికారులు ఇప్పటి వరకు 17మందిని అరెస్ట్ చేశారు. 40లక్షల రూపాయలు చేతులు మారినట్లు సిట్ అధికారుల దర్యాప్తులో తేలింది. సిట్ అధికారుల ఎఫ్ఐఆర్ తో పాటు మీడియాలో వచ్చిన కథనాల ఆధారంగా ఈడీ అధికారులు మనీలాండరింగ్ కేసు నమోదు చేశారు. గత నెల 23న ఈసీఐఆర్ నమోదు చేసిన ఈడీ అధికారులు ఆ మేరకు దర్యాప్తు ప్రారంభించారు. ఇప్పటికే టీఎస్ పీఎస్సీ కాన్ఫిడెన్షియల్ సెక్షన్ అధికారి శంకరలక్ష్మిని పిలిచి ప్రశ్నించారు. ప్రవీణ్, రాజశేఖర్ రెడ్డిల ప్రశ్నించిన తర్వాత వాళ్లిచ్చే సమాచారం ఆధారంగా ఈడీ అధికారులు మరికొంత మందికి నోటీసులు జారీ చేసే అవకాశం ఉంది.
సిట్ అధికారుల దర్యాప్తులో విస్తుగొలిపే విషయాలు:టీఎస్‌పీఎస్సీ పేపర్ లీకేజీ కేసులో కాన్ఫిడెన్షియల్ సెక్షన్ అధికారి శంకర లక్ష్మి డైరీ నుంచి యూజర్ ఐడీ, పాస్వర్డ్ను దొంగలించి.. నిందితులు పేపర్ లీకేజీకి పాల్పడినట్లు మొదటి నుంచి ఇదే సిట్ తెలిపింది. అయితే డైరీని స్వాధీనం చేసుకున్న తర్వాత సిట్ అధికారులకు విస్తుపోయే నిజాలు తెలిశాయి. అసలు ఆమె డైరీలో యూజర్ ఐడీ, పాస్వర్డ్ ఎక్కడా రాయలేదని దర్యాప్తులో తేలింది. నిందితులు మాత్రం ఆమె డైరీ నుంచే దొంగలించామని తమ రిపోర్టులో పేర్కొన్నారు. మరి ఎక్కడ నుంచి వాటిని సేకరించారనే తర్జన భర్జనలో సిట్ అధికారులు పడ్డారు. అదే విషయాన్ని తన డైరీలో ఎలాంటి సమాచారం లేదని.. శంకరలక్ష్మి ఈడీ అధికారుల విచారణలో ఇదే విషయాన్ని తెలిపినట్లు సమాచారం. ఈ కేసును పూర్తిగా చేధించేవరకు ఎలాంటి ఈడీ తమ దర్యాప్తును ముమ్మరం చేయనుంది. అందులో భాగంగా ప్రధాన నిందితులను విచారించేందుకు నాంపల్లి కోర్టులో అనుమతి తెచ్చుకున్నారు.
ఇవీ చదవండి: