Police custody for accused in conspiracy to minister murder case: మంత్రి శ్రీనివాస్ గౌడ్ హత్యకు కుట్ర బయటపడటంతో ఇంటిలిజెన్స్ ఉన్నతాధికారులు ఆయనకు భద్రత పెంచారు. గ్రేహౌండ్స్ పోలీసులతో అదనపు బందోబస్తు ఏర్పాటు చేశారు. నలుగురు గ్రేహౌండ్స్ కానిస్టేబుళ్లు 24 గంటల పాటు విధుల్లో ఉంటారు. మరో నలుగురు ప్రత్యేక పోలీసులు భద్రతగా ఉంటారు. శ్రీనివాస్ గౌడ్‌ను హత్య చేసేందుకు పన్నిన కుట్రను సైబరాబాద్ పోలీసులు ఇటీవల ఛేదించారు. మహబూబ్‌నగర్ పట్టణానికే చెందిన ఏడుగురు కలిసి మంత్రిని హత్య చేసేందుకు కుట్ర పన్నినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. ఈ మేరకు నిందితుల నుంచి 2 తుపాకులు, బుల్లెట్లు కూడా స్వాధీనం చేసుకున్నారు. ఈ నేపథ్యంలో మంత్రి శ్రీనివాస్ గౌడ్‌కు భద్రత పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు.
కస్టడీకి నిందితులు
శ్రీనివాస్ గౌడ్ హత్యకు కుట్ర కేసులో ఏడుగురు నిందితులను మేడ్చల్ కోర్టు పోలీసు కస్టడీకి అనుమతించింది. పోలీసులు 10 రోజుల పాటు కస్టడీకి కోరగా.. కోర్టు నాలుగు రోజులకు అంగీకరించింది. రేపట్నుంచి 4 రోజుల పాటు పేట్ బషీరాబాద్ పోలీసులు నిందితులను విచారించనున్నారు. వీడియో రికార్డింగ్ మధ్య విచారణ జరగనుంది. కుట్ర కేసుపై వివిధ కోణాల్లో పోలీసులు విచారణ చేయనున్నారు.