బాహ్యవలయదారి మహానగరానికి మణిహారం. పొరుగు రాష్ట్రాలు, జిల్లాలకు సాఫీగా ప్రయాణం సాగించేందుకు 158 కిలోమీటర్ల మేరకు విస్తరించిన మార్గం. నిత్యం 1-1.5లక్షల వాహనాలు రాకపోకలు సాగిస్తుంటాయని అంచనా. అయితే ఏటా... ఓఆర్ఆర్ మార్గంలో 250-300కు పైగా ప్రమాదాలు జరుగుతున్నాయి. 55-60 మంది మృత్యువాత పడుతున్నట్టు పోలీసు రికార్డులు చెబుతున్నాయి. వారాంతపు సమయాల్లో ఖరీదైన కార్లలో రహదారిపైకి చేరిన కుర్రకారు రేసింగ్‌లు నిర్వహిస్తున్నట్టు ఆరోపణలున్నాయి.
కానరాని నిబంధనలు
బాహ్యవలయ రహదారి ప్రవేశ మార్గాలు(ఇంటర్‌ఛేంజ్) వద్ద నిబంధనలపై అవగాహన కల్పించాలనే నియమం ఉంది. ఔటర్‌పై 19 రహదారి ప్రవేశమార్గాల్లో ఎక్కడా నిబంధనలు కనిపించవు. గతంతో పోల్చితే పోలీసు గస్తీ, స్పీడ్ లేజర్గన్ల నిఘాతో కొద్దిమేర పరిస్థితి అదుపులోకి వచ్చినా అధికారుల పర్యవేక్షణ కొరవడటంతో మరళా ప్రమాదాల సంఖ్య పెరుగుతోంది. ఈ మార్గంలో ప్రయాణంపై అవగాహన లేకపోవటం, మితిమీరిన వేగం, కేటాయించిన వరుసలు(లైన్ల)ను వదిలేసి పక్క వరుసలోకి వెళ్లటం ప్రమాద తీవ్రతకు కారణమంటున్నారు పోలీసులు. రాచకొండ, సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు సంచార వాహనాలపై స్పీడ్లేజర్ గన్‌లతో ఉల్లంఘనలను గుర్తిస్తున్నారు. కెమెరాకు చిక్కిన వాహనదారుడికి రూ.1000 జరిమానా విధిస్తున్నారు.
ఎవరు ఏ వరుసలో వెళ్లాలి
బాహ్యవలయంలో 4 వరుసలుంటాయి. 1-2లో కార్లు, 4-5 వరుసల్లో లారీలు, భారీవాహనాలు ప్రయాణించాలి. ఈ మార్గంలో ప్రయాణించే వాహనాలు వేగానికి అనుగుణంగా ఏయే వరుసల్లో వెళ్లాలనే దానిపై నిబంధనలున్నాయి. ఇవన్నీ తెలియక వాహనదారులు ఇష్టం వచ్చినట్టుగా వరుసల్ని మార్చుకుంటూ ప్రమాదాలను కొనితెచ్చుకుంటున్నారు. అధికవేగంతో ప్రయాణించే వాహనాలు డివైడర్ వైపు నుంచి మొదటి రెండు వరుసల్లో మాత్రమే వెళ్లాలి. వేగాన్ని తగ్గించాలని అనుకుంటే వెనుక వైపు మరో వాహనం రావట్లేదని నిర్ధారించుకున్న తర్వాతే పక్క వరుసల్లోకి వెళ్లాలి. వాహనాలను ఓవర్‌టేక్ చేసి ముందుకెళ్లే తొందరలో ఇష్టానుసారం వరులను మార్చుతూ దూసుకెళ్తున్నారు. ఎదురుగా ఉన్న వాహన వేగం అకస్మాత్తుగా తగ్గించటం/నిలిపివేయటంతో వెనుక నుంచి ఢీకొడుతున్నారు. అప్పటికే 120-160 వేగంతో వాహనం ప్రయాణిస్తుండటంతో ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉంటుందని అధికారులు చెబుతున్నారు.
మచ్చుకు కొన్ని..