SHAIKPET FLYOVER ACCIDENTS : రోడ్డుపై కాస్త ట్రాఫిక్ తక్కువ ఉంటేనే వాయు వేగంతో దూసుకుపోతున్నాయి వాహనాలు.. అలాంటిది ఫ్లైఓవర్లపై విశాలవంతమైన రోడ్డు... ఖాళీగా కనిపిస్తే ఇక ఆగుతాయా... ప్రమాదకర మలుపుల్లో వేగాన్ని నియంత్రించలేక ప్రమాదాలకు కారణమవుతున్నాయి. పై వంతెనలకు తోడు అధికార యంత్రాంగం ఉదాశీనత, వాహనదారుల నిర్లక్ష్యంతో ఎక్కడోచోట ప్రమాదాలు జరుగుతూనే ఉంటున్నాయి.
షేక్‌పేట్ వంతెనపై వరుస ప్రమాదాలు..
హైదరాబాద్‌లోనే రెండో పొడవైన షేక్‌పేట్ ఫ్లైఓవర్‌ను గత నెల 1న ప్రారంభించారు. ఈ పై వంతెనపై మలుపుల వద్ద ప్రమాదాలు జరుగుతున్నాయి. తాజాగా సాఫ్ట్‌వేర్ ఉద్యోగి ప్రీతమ్ భరద్వాజ్ ప్రమాకరమైన మలుపు వద్ద ద్విచక్రవాహనం పై నుంచి కిందపడి ప్రాణాలు కోల్పోయాడు. కొద్దిరోజుల క్రితం రెండు ద్విచక్రవాహనాలు ఢీకొన్నట్టు సమాచారం. ఈ ఘటనలో ఇద్దరు స్వల్పగాయాలతో బయటపడినట్టు తెలుస్తోంది. రాత్రివేళల్లో మందుబాబులు, ఆకతాయిలు వాహనాలు నిలిపి సెల్ఫీలు తీసుకుంటున్నారు. నగరం నుంచి పొరుగు జిల్లాలు, రాష్ట్రాలకు ప్రయాణించే ప్రధానమైన మార్గం కావటంతో రోజూ వేలాది వాహనాలు రాకపోకలు సాగిస్తుంటాయి. ఇంతటి కీలకమైన మార్గంలో వేగనియంత్రణకు సరైన చర్యలు తీసుకోపోవటం ప్రమాదాలకు కారణమవుతుందనే విమర్శలున్నాయి.
ఇదీ చూడండి :Union Minister Kishan reddy: 'రీజినల్ రింగ్‌రోడ్ తెలంగాణకు మరో మణిహారం'
ఐటీ కారిడార్ వారధిగా
షేక్‌పేట్ పైవంతెన రాయదుర్గం మల్కం చెరువు వద్ద ప్రారంభమై షేక్‌పేట్ బృందాన్ కాలనీ చివరి వరకూ ఉంది. 2.8 కిలోమీటర్ల దూరం, 24 మీటర్ల వెడుల్పు, ఆరు లేన్ల(రాకపోకలకు మూడేసి లేన్లు)తో విశాలంగా ఉంటుంది. అటు నగరం, ఇటు ఐటీ కారిడార్లకు మధ్య వంతెన వారధి. పై వంతెన నిర్మాణ సమయంలోనే క్రేన్ ప్రమాదానికి గురై డ్రైవర్ మరణించాడు. మొదట్లో జాప్యం జరిగినా మంత్రి కేటీఆర్ చొరవతో వేగంగా పనులు పూర్తిచేశారు. ఫలితంగా ట్రాఫిక్ సమస్య తగ్గింది. మాదాపూర్, హైటెక్‌సిటీ, గచ్చిబౌలి, కొండాపూర్ తదితర ప్రాంతాల నుంచి రాకపోకలు సాగించే వారికి సమయం కలిసివస్తోంది. ఇంతటి కీలకమైన పై వంతెనపై ఆరు మలుపులున్నాయి. నాలుగు ప్రమాదకరమైనవిగా ఉన్నాయని వాహనదారులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. రాయదుర్గం వైపు నుంచి ప్రయాణించేటపుడు దాదాపు కిలోమీటరు దూరంలో మూడు మలుపుల్లో రెండు దగ్గరకు వచ్చేంత వరకూ అయోమయానికి గురిచేస్తున్నాయి. షేక్‌పేట నాలా చౌరస్తా, జి.నారాయణ మహిళా ఇంజినీరింగ్ కళాశాల సమీపంలో రెయిలింగ్‌కు ఎత్తయిన బారికేడ్లు నిర్మించారు. రాయదుర్గం వైపు మార్గంలోని మలుపుల వద్ద రెయిలింగ్ ఏర్పాటు చేయలేదు.
బాబోయ్ 100-120 కి.మీ వేగం
వారం రోజుల క్రితం ఓ వ్యక్తి కారులో గచ్చిబౌలి - మెహిదీపట్నం వైపు వస్తుండగా షేక్‌పేట్ వద్ద వంతెన దిగే చోట అదుపు తప్పి పల్టీలు కొట్టింది. కారు నడుపుతున్న వ్యక్తి తీవ్ర గాయాలకు గురికాగా కారు పూర్తిగా ధ్వంసమైంది. గోల్కొండ పోలీసులు కేసు నమోదు చేశారు. పై వంతెనలపై గంటకు 40 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించాలనే నిబంధన ఉంది. అధికశాతం వాహనదారులు వాయు వేగంతో దూసుకెళ్తున్నారు. వేగపరిమితి, మలుపులు, అనుమతి ఉన్న వాహనాల గుర్తులతో సూచికలు ఏర్పాటు చేసినా చూసీచూడనట్టు వెళ్లిపోతున్నారు. ద్విచక్రవాహనదారులు 70 కిలోమీటర్లపైగా వేగంతో ప్రయాణిస్తున్నారు. స్పోర్ట్స్ బైకులైతే 80, 90 కిలోమీటర్లు, కార్లు, ఎస్‌యూవీలు 100-120 కిలోమీటర్లకు వేగంగా ప్రయాణిస్తున్నాయి. ట్రాఫిక్ పోలీసుల పర్యవేక్షణ, సీసీ కెమెరాల ఏర్పాటు లేకపోవటంతో వాహన వేగానికి కళ్లెం వేయటం సవాల్‌గా మారింది. వాహనదారులు నిబంధనలు అనుసరిస్తే ప్రమాదాలు అదుపు చేయవచ్చంటున్నారు అధికారులు. ప్రమాదకరమైన మలుపుల వద్ద బారికేడ్లు ఏర్పాటు చేస్తే తీవ్రతను తగ్గించవచ్చని వాహనదారులు సూచిస్తున్నారు.
బయోడైవర్సిటీ వంతెన ప్రమాదాల నుంచి పాఠాలు..
2019లో నవంబరులో బయోడైవర్సిటీ పై వంతెనపై అతివేగంగా దూసుకొచ్చిన కారు కింద పడింది. ఈ ఘటనలో మలుపు వద్ద నిలబడి ఉన్న మహిళ ప్రాణాలు కోల్పోయి. ప్రమాదం తరువాత అప్రమత్తమైన అధికార యంత్రాం దిద్దుబాటు చర్యలు చేపట్టింది. సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి సైబరాబాద్ కమిషనరేట్‌లోని కంట్రోల్ రూం ద్వారా పర్యవేక్షిస్తున్నారు. సుమారు 3 కి.మీ పొడవైన షేక్‌పేట్ పై వంతెనపై ప్రయాణించే వాహనాల వేగాన్ని అదుపు చేసేందుకు పోలీసులు చర్యలు తీసుకుంటే మరిన్ని ప్రమాదాలు జరక్కుండా కట్టడి చేయగలిగిన వారవుతారు.
ఇదీ చూడండి:Bike Accident At Rayadurgam Fly over : ఫ్లై ఓవర్‌పై ప్రమాదం.. సాప్ట్వేర్ ఉద్యోగి అనుమానాస్పద మృతి