భూవివాదం పరిష్కరించేందుకు భారీగా లంచం తీసుకుంటూ అనిశాకు పట్టుబడ్డ కీసర తహసీల్దార్ నాగరాజు కేసులో ఏసీబీ అధికారులు విచారణ ముమ్మరం చేశారు. నాగరాజు సహా అతనికి లంచం ఇచ్చిన రియల్టర్లు అంజిరెడ్డి, శ్రీనాధ్‌తో పాటు వీఆర్వో సాయిరాజ్‌ను అధికారులు అదుపులోకి తీసుకున్నారు. వారిని నేరుగా నాంపల్లిలోని ఏసీబీ కార్యాలయానికి తరలించారు. అయితే నాగరాజు బంధువులు, స్నేహితులపై కూడా అనిశా దృష్టి పెట్టింది. గతంలో ఆయన షామీర్‌పేట్‌లో పనిచేసినప్పుడు ఆదాయానికి మించి ఆస్తుల కేసులో అరెస్టయ్యాడు. జైలుకు వెళ్లి తిరిగి వచ్చినప్పటికీ... లంచాలు డిమాండ్ చేసి మరీ తీసుకునేవాడని అనిశా అధికారులు గుర్తించారు.
భారీగానే అక్రమాస్తులు..
అల్వాల్‌లోని నాగరాజు నివాసంలో 28 లక్షల రూపాయల నగదు, అరకిలో బంగారు నగలు, ఆస్తులకు సంబంధించిన దస్త్రాలను స్వాధీనం చేసుకున్నారు. అతని బ్యాంకు లాకర్లను గుర్తించిన విచారణ బృందం వాటిని తెరిచే ప్రయత్నాల్లో ఉన్నారు. లాకర్లలో భారీగానే నగదు, ఆస్తులకు సంబంధించిన దస్త్రాలు ఉండవచ్చని అనుమానిస్తున్నారు. కీసరలోని అతని కార్యాలయంలోనూ సోదాలు నిర్వహించారు. ప్రధానంగా తహసీల్దార్ నాగరాజు అవినీతి అక్రమాలకు సంబంధించి ముందుగానే ఏసీబీకి ఫిర్యాదులందినట్టు సమాచారం. ఈ క్రమంలోనే అతని కదలికలపై నిఘా ఉంచిన ఉన్నతాధికారులు లంచం తీసుకుంటుండగా దాడి చేసి పట్టుకున్నట్టు తెలుస్తోంది.