హైదరాబాద్ హయత్‌నగర్‌లో నివాసం ఉంటున్న కేశంపేట తహసీల్దార్ ఇంట్లో అవినీతి నిరోధకశాఖ అధికారులు 93 లక్షల రూపాయలు గుర్తించారు. భారీ ఎత్తున 2 వేలు, 500 రూపాయల నోట్ల కట్టలు చూసి ఖంగుతిన్నారు. కేశంపేట మండలంలో ఓ రైతు నుంచి 4 లక్షలు లంచం తీసుకుంటూ దొరికిన వీఆర్వో అనంతయ్య ఇచ్చిన సమాచారంతో తహసీల్దార్ ఇంట్లో సోదాలు చేశారు.
డబ్బులిస్తే తప్ప పని జరగదు
మామిడిపల్లి భాస్కర్ అనే రైతు తన 9 ఎకరాల పొలానికి కేటాయించిన సర్వే నంబరు రికార్డుల్లో లేదంటూ కేశంపేట తహసీల్దార్‌ను ఆశ్రయించాడు. డబ్బులిస్తే తప్ప పని జరగదంటూ కొందుర్గు అనంతయ్య అనే వ్యక్తి భాస్కర్‌కు సూచించాడు. 8 లక్షల రూపాయలు లంచం ఇవ్వాలంటూ డిమాండ్ చేశాడు. గత నెలలో 30 వేలు బయానాగా తీసుకున్నాడు. ఈ విషయమై భాస్కర్ అనిశా అధికారులకు ఫిర్యాదు చేశాడు. అధికారుల సూచన మేరకు 4లక్షలు ఇస్తానని భాస్కర్ అనంతయ్యకు చెప్పాడు. తహసీల్దార్ కార్యాలయం సమీపంలోని ఓ దుకాణంలో లంచం ఇస్తుండగా... అనిశా అధికారులు పట్టుకున్నారు. తహసీల్దార్ లావణ్య ఆదేశాల మేరకే తీసుకున్నట్లు వీఆర్వో తెలిపారు.
93 లక్షలు ఎక్కడివి..?
హైదరాబాద్ హయత్‌నగర్‌లోని తహసీల్దార్ లావణ్య నివాసంలో అనిశా అధికారులు సోదాలు చేపట్టారు. 93లక్షల విలువైన నోట్ల కట్టలు, 43 తులాల బంగారు ఆభరణాలు బయటపడ్డాయి. ప్రభుత్వ అధికారిని ఇంత నగదు ఎందుకు ఉంచుకుంది, ఎక్కడి నుంచి వచ్చాయి వంటి వివరాలపై ఆరా తీస్తున్నారు. లావణ్య 2016 నుంచి కేశంపేట తహసీల్దార్‌గా, ఆమె భర్త జీహెచ్ఎంసీ సూపరింటెండెంట్‌గా విధులు నిర్వహిస్తున్నట్లు విచారణలో తేలింది. వీఆర్వో అనంతయ్యను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.
అధికారిని ఇంట్లో 93 లక్షల నగదు, 43 తులాల బంగారం ఎక్కడివి..? ఇదీ చూడండి : 'లంచాలు ఇచ్చే పనిలేకుండా రెవెన్యూ విధానం'