తెలంగాణ

telangana

ETV Bharat / state

గతంలో అనిశాకు చిక్కి... ఇప్పుడు వారికే పట్టించి - Acb latest updates

లంచం తీసుకుంటూ అనిశాకు చిక్కిన గిడ్డంగుల సంస్థ ఉద్యోగి బానోతు సుందర్‌లాల్‌.. పదవీ విరమణ అనంతరం ప్రయోజనాల కోసం అధికారులను కలిశాడు. పదవీ విరమణ ప్రయోజనాల మంజూరు కోసం ఉన్నతాధికారులు లంచం డిమాండ్‌ చేయగా సుందర్‌లాల్‌.. అనిశాను ఆశ్రయించాడు. లంచం తీసుకుంటున్న సయమంలో ఇద్దరు ఉన్నతాధికారులను పట్టించాడు.

గతంలో అనిశాకు చిక్కి... ఇప్పుడు వారికే పట్టించి
గతంలో అనిశాకు చిక్కి... ఇప్పుడు వారికే పట్టించి

By

Published : Jan 21, 2021, 5:07 AM IST

గతంలో అనిశాకు చిక్కి... ఇప్పుడు వారికే పట్టించి

గతంలో లంచం తీసుకుంటూ అవినీతి నిరోధకశాఖకు చిక్కిన ఉద్యోగి... పదవీ విరమణ అనంతరం ప్రయోజనాల కోసం తనను లంచం అడిగిన ఇద్దరు ఉన్నతాధికారులను అనిశాకు పట్టించాడు. రాష్ట్ర గిడ్డంగుల సంస్థలో పనిచేసిన బానోతు సుందర్‌లాల్‌... 2013లో పెద్దపల్లిలో అనిశాకు చిక్కాడు. కేసు నమోదు కావడం వల్ల విధుల నుంచి సస్పెండ్‌ అయ్యాడు. అనంతరం 2015లో తిరిగి ఉద్యోగంలో చేరి... 2018లో విరమణ పొందాడు.

ఆర్థిక ప్రయోజనాల కోసం...

అనిశా కేసు నమోదైన కారణంగా ఉద్యోగ విరమణ చేసిన తర్వాత లభించాల్సిన ఆర్థిక ప్రయోజనాలు నిలిచిపోయాయి. వాటికోసం గిడ్డంగుల సంస్థ ఎండీ భాస్కరాచారిని సంప్రదించాడు. భాస్కరాచారి గిడ్డంగుల శాఖతో పాటు మార్క్‌ఫెడ్, హాకా ఎండీగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. సుందర్‌లాల్‌ పలుమార్లు కార్యాలయం చుట్టూ తిరగ్గా... జనరల్‌ మేనేజర్‌ సుధాకర్‌రెడ్డిని కలవమని ఎండీ భాస్కరాచారి తెలిపారు.

రూ. 75 వేలకు ఒప్పందం...

రూ. లక్ష ఇస్తే ప్రయోజనాలు వచ్చేలా చూస్తామని సుధాకర్‌రెడ్డి తెలపగా... తాను రూ. 75 వేలు ఇస్తానని సుందర్‌లాల్‌ ఒప్పుకున్నాడు. నగదు ఇస్తుండగా అనిశా అధికారులు సుధాకర్‌రెడ్డిని పట్టుకున్నారు. ఎండీ భాస్కరాచారి ఆదేశాల మేరకే తాను లంచం తీసుకున్నట్టు సుధాకర్‌ రెడ్డి అనిశాకు తెలిపాడు. ఎండీ, జీఎంలను అనిశా అధికారులు అదుపులోకి తీసుకున్నారు.

అనిశా సోదాలు...

లంచం ఇవ్వడం ఇష్టం లేని సుందర్‌లాల్‌... ఫిర్యాదు ఇవ్వగా అనిశా రంగంలోకి దిగి ఉన్నతాధికారులను పట్టుకుంది. హైదరాబాద్ నాంపల్లిలోని గిడ్డంగుల సంస్థ కార్యాలయంతోపాటు.. ఎంజే మార్కెట్‌లోని మార్క్‌ఫెడ్‌ కార్యాలయం, కొత్తపేటలోని ఎండీ, జీఎం నివాసాల్లో సోదాలు చేశారు. భాస్కరాచారి, సుధాకర్‌రెడ్డిని అరెస్టు చేసి అనిశా ప్రత్యేక కోర్టులో హాజరుపరిచారు. వారిద్దరికీ కోర్టు 14 రోజుల రిమాండ్‌ విధించగా... చంచల్‌గూడ జైలుకు తరలించారు.

ఇదీ చూడండి:సీఎం బహిరంగ క్షమాపణలు చెప్పాలి: కోమటిరెడ్డి

ABOUT THE AUTHOR

...view details