ఆటో ప్రయాణికులకు అత్యాధునిక భద్రత కల్పించడానికి వీలుగా ఏపీలోని పోలీసులు, రవాణా శాఖ అధికారులు విస్తృత కసరత్తు చేస్తున్నారు. అందుకోసం ‘'అభయం'’ పేరుతో ఒక ఉపకరణాన్ని విస్తృతంగా అందుబాటులోకి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారు. దాని పనితీరును ప్రయోగాత్మకంగా తెలుసుకోవడానికి వీలుగా ఇప్పటికే సుమారు రెండువేల అభయ ఉపకరణాలను విశాఖ నగరంలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న ఆటోలకు బిగించారు.
పోలీసుల కనుసన్నల్లో ప్రయాణం
అభయ ఉపకరణం ఉన్న ఆటోలు పోలీసుల కనుసన్నల్లో ఉంటాయి. అవి ఎప్పుడెప్పుడు? ఏఏ మార్గాల్లో? ఎక్కడెక్కడ? తిరుగుతున్నాయన్న అంశాలు, ఎప్పటికప్పుడు నమోదవుతుంటాయి. ఫలితంగా ఆయా ఆటోల్లో ప్రయాణికులకు తగిన భద్రత ఉంటుందన్నది ఆలోచన.
మీట నొక్కితే క్షణాల్లో పోలీసులొస్తారు..
‘అభయ’ ఉపకరణానికి ఒక అత్యవసర మీట ఉంటుంది. ఆటోలో ప్రయాణించే వారు ఆ మీట నొక్కిన వెంటనే పోలీసుల నియంత్రణ గదిలోని సిబ్బంది అప్రమత్తమై ఆ ఆటో ఉన్న ప్రదేశానికి సమీపంలోని పోలీసులను క్షణాల్లోనే పంపిస్తారు. ప్రయాణికులు మీట నొక్కారంటే వారు ఆపదలో ఉన్నట్లు పోలీసులు పరిగణిస్తారు.
ప్రతి ఉపకరణానికి ఒక నెంబర్..
ప్రతి అభయ ఉపకరణానికి ఒక సీరియల్ నెంబర్ ఉంటుంది. ఫలితంగా ఆ ఉపకరణం వినియోగిస్తున్న ఆటో వివరాలు, దాని యజమానుల వివరాలు పోలీసులకు క్షణాల్లో తెలుస్తాయి. ఆ ఉపకరణాన్ని ఆటోడ్రైవర్లకు ఉచితంగానే ఇస్తారు. రవాణాశాఖ అధికారుల ఆధ్వర్యంలో ఏర్పాటు ప్రక్రియ జరుగుతోంది.