రాష్ట్రవ్యాప్తంగా ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఆరోగ్య శ్రీ, ఈహెచ్ఎస్ సేవలు నిలిపివేయటం వల్ల రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అత్యవసరంగా పేర్కొనే గుండె, కిడ్నీ రోగులకు రక్త మార్పిడీ ప్రక్రియలను అందించటం లేదంటూ కొన్ని ఆస్పత్రుల బయట ఏకంగా బోర్డులు పెట్టడం గమనార్హం. రోగులు దిక్కు తోచని పరిస్థితుల్లో ఉన్నారు. ఉస్మానియా, గాంధీల్లో ఒక్కసారిగా రోగుల తాకిడి పెరిగింది.
దూర ప్రాంతాల నుంచి రాక...
నగరంలో పేరొందిన ప్రైవేట్ ఆసుపత్రిల్లో చికిత్స కోసం తెలుగు రాష్ట్రాల నుంచి అనేకమంది రోగులు వస్తుంటారు. ఏపీకి సంబంధించి గుండె, కేన్సర్ కేసులను ఇక్కడి ఆసుపత్రుల్లో అనుమతిస్తున్న సంగతి తెలిసిందే. అక్కడి రోగులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా సేవలు కొనసాగిస్తున్నారు. తెలంగాణ జిల్లాలకు చెందిన ఆరోగ్యశ్రీ రోగులు, ఈహెచ్ఎస్ రోగులకు చుక్కలు చూపిస్తున్నారు. కొన్ని కార్పొరేట్ ఆసుపత్రులు సేవలను అందించేందుకు ముందుకొస్తున్నా... చికిత్సకయ్యే ఖర్చులో 50శాతం ముందే డిపాజిట్ చేయించుకుంటున్నట్లు తెలుస్తోంది.