గత బల్దియా పాలకవర్గ ఎన్నికల హామీల్లో భాగంగా హైదరాబాద్ మహానగరంలో ఉచిత తాగునీటిని అందరికీ అందిస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. ఇందుకు కొన్ని నిబంధనలను రూపొందించారు. ప్రతి నల్లాదారుడు తమ పీటీఐఎన్ నంబరుతోపాటు ఆధార్ నంబరును జలమండలి వెబ్సైట్లోకి వెళ్లి అనుసంధానం చేసుకోవాలన్నది మొదటి నిబంధన. రెండోది నల్లాకు తప్పనిసరిగా మీటరు ఏర్పాటు చేయడం. ఈ రెండూ ఉంటేనే ఉచిత తాగునీటి పథకానికి అర్హులని పేర్కొంది.
గత ఏడాది డిసెంబరు నుంచి ఉచితంగా నీరు ఇస్తోంది. ఈ ఏడాది ఏప్రిల్ నెలాఖరు వరకు అనుసంధానానికి గడువు ఇచ్చింది. మొత్తం 10.50 లక్షల తాగునీటి కనెక్షన్లు ఉంటే 9.50 లక్షల కనెక్షన్లు గృహాలకు సంబంధించినవి. వీరంతా పథకంలో భాగం కావాలన్న ఉద్దేశంతో జలమండలి ఎండీ దానకిశోర్ సిబ్బందిని అపార్ట్మెంట్లకు పంపి.. అనుసంధానం చేయాలని సూచించారు. పెద్ద ఎత్తున కృషి చేసినా.. చాలా మంది ముందుకు రాలేదు. 4.50 లక్షల మంది మాత్రమే స్పందించారు. గడువు ముగియడంతో మిగతా ఐదు లక్షల నల్లాదారులకు ఏడు నెలల బిల్లు ఒకేసారి జారీ చేశారు. దీంతో మరోసారి గడువిస్తే ప్రక్రియ పూర్తి చేస్తామని వినియోగదారులు మంత్రి కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లారు. స్పందించిన ఆయన మరో 40 రోజులు గడువు ఇచ్చారు.