గ్రేటర్ హైదరాబాద్‌లో ఉచిత తాగునీటి పథకానికి ఆధార్‌ను తప్పనిసరి చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది. ఈ నెలాఖరులోగానీ వచ్చే నెలలో గానీ అమలు చేయడానికి సన్నాహాలు చేస్తోంది. దిల్లీలో అమలు చేస్తున్నట్లుగా ఇక్కడ కూడా పారదర్శకంగా ఈ పథకాన్ని అమలు చేయాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా తాగునీటి కనెక్షన్‌కు ఆధార్ తప్పనిసరి చేస్తూ పురపాలకశాఖ ముఖ్యకార్యదర్శి అర్వింద్‌కుమార్ పేరుతో ఈ నెల 2న జీవో విడుదలైంది. దీనిని శుక్రవారం అధికారికంగా విడుదల చేశారు.
ఆధార్ లేనివారు వెంటనే దరఖాస్తు చేసి, ఆ రసీదునైనా చూపాలి. ఈ ప్రక్రియలో ఆలస్యమైతే పోస్టాఫీసు పాస్‌బుక్, పాన్‌కార్డు, పాస్‌పోర్టు, రేషన్‌కార్డు, ఓటర్ ఐడీలలో ఒకటి సమర్పించాలి. అయితే ప్రస్తుత కనెక్షన్‌దారులంతా ఆధార్ ఇవ్వాలా లేక కొత్తగా కనెక్షన్ తీసుకునేవారు ఇవ్వాలా అనే విషయంపై జీవోలో స్పష్టత లేదు. అధికారుల లెక్కల ప్రకారం మహానగరంలో 10.50 లక్షల తాగునీటి కనెక్షన్లున్నాయి. ఇందులో 9,84,940 ఇళ్లకు తాగునీరు సరఫరా చేసేవి. ఇందులో దాదాపు మూడొంతుల కనెక్షన్‌లకు మీటర్లు లేవు. కేవలం సగటు సరఫరా ఆధారంగా వీటికి బిల్లులు ఇస్తున్నారు. అలానే భారీగా దొంగ కనెక్షన్లున్నాయి.