రెండు మూడు తరాల క్రితం ఆహారాన్ని.. మట్టి లేక ఇత్తడి పాత్రల్లో వండేవారు. ఆ తర్వాత సులభంగా వంట పూర్తవుతుందని.. శుభ్రం చేసుకోవటం సులభం కావాలనే ఉద్దేశంతో.. అల్యూమినియం, స్టీల్‌కి డిమాండ్ బాగా పెరిగింది. నూనె లేకుండా వంట చేసుకోవచ్చని మార్కెట్లోకి వచ్చిన నాన్‌స్టిక్ పాత్రలని జనం బాగానే ఆదరించారు. అయితే ఇటీవల కాలంలో.. ఆరోగ్యానికి మంచిదంటూ మట్టిపాత్రల వైపు వెళ్తున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది.
విభిన్న రకాల ఇత్తడి వంటపాత్రలు, వివిధ వస్తువులు:అందుకే ఆరోగ్యకరమైన ఆహారం వండేందుకు వీలుగా నాణ్యమైన పాత్రలు అందించాలని నిర్ణయించారు హైదరాబాద్‌కి చెందిన పవిత్రాకుమార్. సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేస్తూ రూ.లక్షల్లో జీతం సంపాదిస్తున్నా.. సమాజానికి మేలు చేసే ఉద్దేశంతో పవిత్రా ఆర్గానిక్స్‌ను ఏర్పాటు చేశారు. కూకట్‌పల్లి జేఎన్టీయూ సమీపంలోని పవిత్రా ఆర్గానిక్స్‌లో అడుగుపెడితే.. విభిన్న రకాల ఇత్తడి వంట పాత్రలు, పాతకాలం నాటి రాగి, ఇత్తడి బిందెలు, పూజా సామాన్లు, దేవుడి ప్రతిమలు వంటి వివిధ వస్తువులు దర్శనమిస్తాయి.
పాత్రల నాణ్యతను శాస్త్రీయంగా పరీక్షించిన తర్వాతే మార్కెట్‌లోకి: చిన్నతనంలో చూసిన అమ్మమ్మ కాఫీ ఫిల్టర్ మొదలు.. ఎన్నోరకాల అనుభూతిని కలిగిస్తాయి. అల్యూమినియం పాత్రల్లో వండితే ఆహారంలో కేవలం 15 నుంచి 20 శాతం పోషకాలు మాత్రమే మిగిలి ఉంటాయని పవిత్రాకుమార్ చెబుతున్నారు. ఇత్తడి పాత్రల్లో నేరుగా కూరలు వండటం ఇబ్బందికరమని అంటున్న ఆయన.. ఇత్తడికి తగరపు కోటింగ్ వేసి పాత్రలు తయారు చేయిస్తున్నారు. పాత్రల నాణ్యతను శాస్త్రీయంగా పరీక్షించిన తర్వాతే మార్కెట్‌లోకి తీసుకువస్తున్నారు.