బతికినన్నాళ్లు ఎలా బతికినా పోయేలోపు నలుగురికి ఉపయోగపడే పనులు ఏమైనా చేసే పోవాలి అంటారు పెద్దలు. మాట సాయం చేయడానికే మనుషులు కరవైపోతున్న ఈ రోజుల్లో... తన ప్రాణం పోయినా తర్వాత అవయవాలు అవసరమైన వారికి ఉపయోగపడాలనుకునే వారు అరుదు. అలాంటి కోవలోకి వస్తుంది హైదరాబాద్‌కు చెందిన చరితా రెడ్డి.
మూడు రోజుల కిందట అమెరికా లాన్సింగ్లో జరిగిన కారు ప్రమాదంలో హైదరాబాద్ నేరెడ్‌మెట్‌కు చెందిన చరితారెడ్డి మృతిచెందింది. ఈ ఘటనలో ఆమె బ్రెయిన్‌డెడ్ అయినట్లు ముస్కేగాన్ ఆస్పత్రి వైద్యులు వెల్లడించారు. మరణానతరం తల్లిదండ్రుల అంగీకారంతో అవయవదానం చేశారు. జ్ఞాపకాలను తల్లిదండ్రులకు మిగిల్చి... తొమ్మిది కుటుంబాల్లో వెలుగులు నింపింది.