waiting for ambulance: ఆపదలో ఉన్న ఓ మహిళ అంబులెన్స్ కోసం గంటల తరబడి ఎదురుచూడాల్సిన దుస్థితి మంగళవారం ఆంధ్రప్రదేశ్లోని నందిగామలో చోటుచేసుకుంది. ప్రాథమిక చికిత్స అందించిన వైద్యులు.. అత్యవసరంగా తరలించాలని చెప్పగా అంబులెన్స్ కోసం గంటల కొద్దీ నిరీక్షించాల్సి వచ్చింది. అదిగో వస్తున్నాం.. ఇదిగో వస్తున్నాం.. అన్నారే తప్ప.. మధ్యాహ్నం 12గంటల వరకూ రాకపోవడంపై రోగి బంధువులు మండిపడ్డారు.
ఎన్టీఆర్ జిల్లా వీరులపాడు మండలం పొన్నవరం గ్రామానికి చెందిన కోట అన్నమ్మ తీవ్రమైన జ్వరం, ఆయాసంతో వైద్యశాలలో చేరింది. ఆమెను పరీక్షించిన వైద్యులు.. ఆరోగ్య పరిస్థితి సీరియస్గా ఉందని బంధువులకు చెప్పారు. వెంటనే మెరుగైన వైద్యం కోసం విజయవాడ పంపాలని నిర్ణయించారు. వారు ఉదయం 7:55 గంటలకు 108కు కాల్ చేసి అంబులెన్స్ పంపించాలని కోరారు. ఎంతసేపు ఎదురుచూసినా రాకపోవడంతో రోగి బంధువులు ఆందోళన చెందారు.