Liquor Sales Increased On Dussehra festival: రాష్ట్రంలో దసరా పండగకు వారం రోజుల ముందే మద్యం విక్రయాలు ఊపందుకున్నాయి. సాధారణ రోజుల్లో నిత్యం రూ.60-90 కోట్ల విలువైన విక్రయాలు సాగుతాయి. ప్రస్తుతం డిపోల నుంచి దుకాణాలకు రోజుకు రూ.100 కోట్లకుపైగా మద్యం తరలుతోంది. ఈ నెల 26న రూ.174.55 కోట్లు, 27న రూ.123.93 కోట్లు, 28న రూ.117.02 కోట్ల విలువైన విక్రయాలు జరిగాయి.
కరోనా కారణంగా 2020, 2021 సంవత్సరాల్లో మద్యం విక్రయాలపై ప్రభావం పడగా.. ఈసారి అది కనిపించడం లేదు. గతేడాది జనవరి నుంచి సెప్టెంబరు వరకు జరిగిన అమ్మకాలతో పోలిస్తే ఈ ఏడాది అదే కాలానికి రూ.3,300 కోట్లకు పైగా ఎక్కువ విక్రయాలు జరిగాయి. ఈ ఏడాది జనవరి నుంచి బుధవారం నాటికి రూ.25,223.58 కోట్ల మద్యం అమ్ముడుపోయింది.
దసరాకు ఇంకా కొన్ని రోజులు మిగిలి ఉండటంతో రూ.26 వేల కోట్లు దాటే అవకాశం కనిపిస్తోంది. ఈ ఏడాది ఇంకా మూడు నెలలు మిగిలి ఉండటం.. డిసెంబరు 31 వేడుకల్లో మద్యం ఎక్కువగా అమ్ముడుపోయే అవకాశం లాంటి కారణాలతో విక్రయాల విలువ రూ.35 వేల కోట్లు దాటుతుందని ఎక్సైజ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
అక్రమ మద్యం కట్టడిపై దృష్టి:మద్యం అమ్మకాల జోరు నేపథ్యంలో అక్రమ దిగుమతి నివారణపై రాష్ట్ర ఎక్సైజ్‌శాఖ దృష్టి సారించింది. ఇతర రాష్ట్రాల మద్యంపై ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్, టాస్క్‌ఫోర్స్ బృందాలు నిఘా విస్తృతం చేశాయి. ఇటీవల గోవా నుంచి తీసుకొచ్చిన 90 కార్టన్ల మద్యాన్ని మేడ్చల్ ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో.. కర్ణాటక నుంచి తెచ్చిన 40 కార్టన్ల మద్యాన్ని గద్వాల జిల్లాలో అధికారులు స్వాధీనం చేసుకున్నారు.