అటవీశాఖ గణాంకాల ప్రకారం ఆగస్టు 31 వరకు పూర్తికావాల్సిన ఆరోవిడద హరితహారం కార్యక్రమం లక్ష్యం చేరుకోలేదు. గతేడాది చేపట్టిన ఐదో విడత హరితహారంలో రాష్ట్ర వ్యాప్తంగా 38 కోట్ల మొక్కలు నాటారు. 2020లో దాన్ని 29.86 కోట్లకు కుదించినా లక్ష్యాన్ని చేరలేదు. ‘కరోనా ప్రభావంతోపాటు ఉపాధి హామీ కూలీల కొరత, మొక్కలు దొరక్కపోవడం వంటివి అడ్డంకులు సృష్టించాయి. ముఖ్యంగా విద్యా సంస్థలు మూసి ఉండటం వల్ల సామూహికంగా మొక్కలు నాటడం ఈసారి బాగా తక్కువైంది. ఇది హరితహారంపై ప్రభావం చూపింది’ అని అధికారులు విశ్లేషిస్తున్నారు.
* శాఖల వారీగా చూస్తే పురపాలకశాఖ నిర్దేశించిన లక్ష్యంలో 43.92 శాతమే పూర్తిచేసింది. పురపాలకశాఖలో భాగమైన గ్రేటర్ హైదరాబాద్ కార్పొరేషన్, హెచ్‌ఎండీఏ, వరంగల్ కార్పొరేషన్లకు విడివిడిగా లక్ష్యాలు నిర్దేశించారు. జీహెచ్‌ఎంసీ 62.73 శాతం, హెచ్‌ఎండీఏ 50.78 శాతం, వరంగల్ అర్బన్ 42.65 శాతం పూర్తిచేశాయి.