పసి ప్రాయంలో అద్భుత ప్రతిభ కనపరుస్తూ అందరిచేత ఔరా అనిపిస్తున్నాడు ఐదేళ్ల చిన్నారి మాన్విక్. హైదరాబాద్ మల్కాజ్గిరి ఆనంద్‌బాగ్‌లోని భ్రమరాంబిక నగర్లో నివాసం ఉంటున్న వేణుగోపాల్, కిరణ్మయిల దంపతుల తనయుడు మాన్విక్ నిజాంపేటలోని విజ్ఞాన్ స్కూల్లో ఒకటో తరగతి చదువుతున్నాడు. చదువులో చురుకుగా ఉండే మాన్విక్ చిన్నతనంలోనే సామాజిక, ప్రపంచ భౌగోళిక అంశాల పట్ల ఆసక్తి కనబరిచేవాడు.
ప్రపంచాన్ని అలవోకగా అప్పజెపుతాడు
ఈ తరుణంలో లాక్డౌన్ రావడం వల్ల ఇంట్లోనే తల్లిదండ్రుల సమక్షంలో ప్రపంచ పటాలలో ప్రముఖ ప్రాంతాలను గుర్తించడం, దేశాల పేర్లు, ప్రపంచ పటాన్ని అమర్చడం, ప్రపంచ దేశాల పతాకాలను గుర్తించడం, భారతదేశానికి సంబంధించిన రాష్ట్రాల సమాచారం, ప్రపంచ భౌగోళిక స్థితిగతులు, ప్రసిద్ధి చెందిన చారిత్రాత్మక కట్టడాలు వాటి విశేషాలను తనదైన శైలిలో గుర్తింపు తెచ్చుకుని అలవోకగా అప్పజెప్తున్నాడు. అతి తక్కువ సమయంలోనే ప్రపంచ పటానికి సంబంధించిన అనేక విషయాలను గ్రహించి, తన మేధోశక్తిని ఉపయోగించి వాటిపై పట్టు సాధించి అడిగిన వాటికి గుక్కతిప్పకుండా సమాధానం చెప్తూ ఔరా మాన్విక్ అనిపించుకుంటున్నాడు.