ఇంటింటికీ నల్లానీరు అందించాలనే బృహత్ లక్ష్యంతో చేపట్టిన మిషన్ భగీరథ పథకం రికార్డు స్థాయిలో పూర్తైందనే చెప్పుకోవచ్చు. ఏడాదికే తొలి ఫలాలను అందించారు. 2015 జూన్ తొమ్మిదో తేదీన ఉమ్మడి నల్గొండ జిల్లా చౌటుప్పల్‌లో మిషన్ భగీరథ పైలాన్‌ను ముఖ్యమంత్రి కేసీఆర్ ఆవిష్కరించారు. ఫ్లోరైడ్ సమస్య పీడించిన ఆ ప్రాంతం నుంచే ఇంటింటికీ నల్లానీరు అందించే పథకం పనులకు శంకుస్థాపన చేశారు. మిషన్ భగీరథలో భాగంగా చేపట్టిన గజ్వేల్ సెగ్మెంట్‌ను ప్రధానమంత్రి నరేంద్రమోదీ చేతుల మీదుగా 2016 ఆగస్టు ఏడో తేదీన ప్రారంభించారు. దీనితో ఆ రోజు నుంచి రాష్ట్రంలో మిషన్ భగీరథ ఫలాలు అందడం ప్రారంభమైంది.
ప్లోరోసిస్ ప్రాంతంతో ప్రారంభమై...
ప్రారంభం నాటి నుంచి దశలవారీగా ఆయా సెగ్మెంట్లలో మిషన్ భగీరథ పనులను పూర్తి చేస్తూ ఇంటింటికీ నల్లాల ద్వారా రక్షిత మంచినీటిని సరఫరా చేస్తూ వస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలోని 23వేలా 968 ఆవాసాలకు మిషన్ భగీరథ ద్వారా పూర్తి స్థాయిలో శుద్ధి చేసిన జలాలను బల్క్‌గా అందిస్తున్నారు. అందులో 23వేలా 919 ఆవాసాల్లోని అన్ని ఇండ్లకు నల్లాల ద్వారా కూడా రక్షిత మంచినీటిని సరఫరా చేస్తున్నారు. మరో 49 ఆవాసాల్లో మాత్రమే నల్లానీరు సరఫరా చేయాల్సి ఉందని మిషన్ భగీరథ శాఖ గణాంకాలు చెప్తున్నాయి. రాష్ట్రంలోని 55లక్షలా 59వేలా 172 ఆవాసాలకు గాను వందశాతం నల్లా కనెక్షన్ కూడా ఇచ్చారు. అందులో 55లక్షలా 26వేలా 518 ఇండ్లకు నల్లాల ద్వారా నీటి సరఫరా జరుగుతోంది.