నిమ్స్‌లో వ్యాధి వ్యథకు ప్రకృతి చికిత్స Solarium in Nims Hospital : హైదరాబాద్ నిమ్స్ ఆసుపత్రికి.. వైద్యసేవల్లో తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశంలోనే ఓ ప్రత్యేక స్థానం ఉంది. పేద, మధ్యతరగతి వర్గాల పాలిట వైద్య సంజీవనిగా విరజిల్లుతోంది. ఇలాంటి నిమ్స్ ఇప్పుడు మరో ప్రత్యేకతకు కేంద్రంగా నిలిచింది. ఆసుపత్రి వాతావరణాన్ని ఆహ్లదకరంగా మార్చే క్రతువుకు నడుంబిగించింది నిమ్స్ యాజమాన్యం. రోగులు వ్యాధి బాధను మరిచి చక్కని వాతావరణంలో సేదతీరేలా వార్డుల పక్కన సొలారియం హరితవనాలను అభివృద్ధి చేసింది.
సొలారియంలో రోగులకు సేదతీరేందుకు అవకాశం : వివిధ విభాగాల పక్కన ఖాళీగా ఉన్న స్థలంలో పచ్చని గడ్డి, చూడముచ్చటైన మొక్కలు, అందమైన కుండీల్లో ఏర్పాటు చేసింది. ఈ ప్రాంతంలో రోగులు కాసేపు సేదతీరేందుకు అవకాశం కల్పించింది. సొలారియం అంటే భవంతుల పక్కన ఖాళీ స్థలంలో పచ్చని మొక్కలు పెంచి వాటి మధ్య గాలి వెలుతురు ధారాళంగా వచ్చేలా అద్దాల గదిని ఏర్పాటు చేస్తారు. నిమ్స్‌లో మాత్రం అద్దాల గదులు లేకుండానే 3,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో పచ్చిక బయళ్లు, సుందరమైన మొక్కలు పెంచుతున్నారు.
నిమ్స్ పాత భవనంలోని డయాలసిస్, ఆర్ధోపెడిక్, క్యాన్సర్ వార్డు, ప్రైవేట్ రూమ్స్ వద్ద సోలారియం విధానంలో పార్కులు సిద్ధం చేశారు. త్వరలోనే ఇతర బ్లాకుల వద్ద ఉద్యానవనాలు ఏర్పాటు చేయనున్నట్టు ఆసుపత్రి ఇంఛార్జ్ డైరెక్టర్ డాక్టర్ బీరప్ప స్పష్టం చేశారు. రోగులు రోజూ కనీసం 15 నిమిషాలు ఆ పచ్చిక బయళ్లలో సమయం గడపేందుకు అవకాశం కల్పిస్తున్నట్లు తెలిపారు. తద్వారా మనసుకు స్వాంతన కలుగుతుందని.. వ్యాధి వ్యథను ప్రకృతి సోయాగాలతో మర్చిపోగలుగుతారని చెబుతున్నారు. కార్పొరేట్ కార్యాలయాల్లో ఉన్న ఈ పద్ధతిని నిమ్స్ ఆసుపత్రి అనుసరించడంతో దవాఖానాలకు సరికొత్త మార్గాన్ని చూపింది.
"నిమ్స్ ఆసుపత్రి ఎందుకు హరితంగా ఉండకూడదనే ఆలోచనకు.. ముందు అడుగే ఈ సొలారియం. ఈ ప్రదేశంలోకి రోగి కనీసం 10 నిమిషాలు ఉంటే ఆ కాస్త సమయంలో వారి వ్యాధి ఏంటో మరిచిపోతారు. ప్రకృతికి దగ్గరగా ఉన్నప్పుడు మనలో ఉన్న జబ్బులు తొందరగా నయమవుతాయి. గుండెకు సంబంధించిన ఆపరేషన్ చేసిన తరువాత రోగిని ఆ గ్రీనరీ దగ్గర కూర్చోబెడతాం. దీంతో వారి మనసు ఆహ్లాదంగా ఉండే అవకాశం ఉంటుంది. మనసు బాగుంటునే జబ్బు నయం అవుతుంది. కొంత మంది దాతల సాయంలో ఇది పూర్తి చేయగలిగాం." - డా. బీరప్ప, నిమ్స్ ఆసుపత్రి ఇంఛార్జ్ డైరెక్టర్
ఇవీ చదవండి: