తెలంగాణ

telangana

ETV Bharat / state

ఈ నగరానికి ఏమైంది.. అగ్నిప్రమాదాలు నివారించేవారే లేరా..! - Fire accidents in Secunderabad updates

Fire accidents in Secunderabad: ఎలా చిచ్చురేగుతుందో తెలియదు. ఎక్కడి నుంచి ఎగిసిపడతాయో అర్థం కాదు. కనురెప్ప మూసి తెరిచేలోగా చెలరేగే మంటల్లో.. కనుచూపు మేరల్లో కమ్ముకునే పొగలో చిక్కి ఆహాకారాలతోనే ఊపిరి ఆగిపోతుంది. సికింద్రాబాద్‌లో ఆర్నెళ్ల కాలంలోనే చోటుచేసుకున్న 3 భారీ అగ్నిప్రమాదాలు మిగిల్చిన విషాదం అంతా ఇంతాకాదు. నిన్న సాయంత్రం స్వప్నలోక్‌ ఘటనతో జంటనగరాలు మరోసారి ఉలిక్కిపడ్డాయి.

Fire accidents at 3 places in Secunderabad itself
సికింద్రాబాద్​లోనే 3 చోట్ల అగ్ని ప్రమాదాలు

By

Published : Mar 17, 2023, 9:31 AM IST

సికింద్రాబాద్​లో వరుసుగా సంభవిస్తున్న అగ్ని ప్రమాదాలు

Fire accidents in Secunderabad: సికింద్రాబాద్​లో గత ఆర్నెళ్ల కాలంలో మూడు భారీ అగ్నిప్రమాదాలు చోటుచేసుకున్నాయి. ఈ ఘటనలు మిగిల్చిన విషాదం అంతా ఇంతా కాదు. ఇప్పటి వరకు ఈ ప్రమాదాల్లో 29 మంది దుర్మరణం చెందారు. తక్కువ సమయంలోనే వరుసగా అగ్ని ప్రమాదాలు జరుగుతున్నాయి. ప్రమాదాలు జరిగిన తర్వాత సహాయక చర్యలే తప్ప.. ఘటనలు చోటుచేసుకోకుండా ముందస్తు చర్యలను మాత్రం ప్రభుత్వం చేపట్టడం లేదు.

2022 సెప్టెంబర్‌ 12 రూబీ లగ్జరీ ప్రైడ్‌ హోటల్‌లో:పాస్‌పోర్ట్‌ కార్యాలయం సమీపంలోని ఈ అయిదంతస్తుల భవనంలోని సెల్లార్‌, గ్రౌండ్‌ ఫ్లోర్లలో రూబీ ఎలక్ట్రిక్‌ వాహనాల షోరూం నడుస్తోంది. మిగిలిన నాలుగు అంతస్తుల్లో హోటల్‌ నిర్వహిస్తున్నారు. గ్రౌండ్‌ ఫ్లోర్‌లో ఉన్నట్టుండి మంటలు చెలరేగటంతో విద్యుత్‌ షార్ట్‌ సర్క్యూట్‌ జరిగి.. ఆ వేడికి షోరూంలోని ఎలక్ట్రిక్‌ వాహనాల బ్యాటరీలు పేలాయి. దీంతో మంటల ఉద్ధృతి మరింత పెరిగి.. వాహనాలకు వ్యాపించడంతో పెద్దఎత్తున మంటలు ఎగసిపడ్డాయి. మెట్లమార్గం ద్వారా మంటలు పై అంతస్తులకు వ్యాపించగా.. వాహనాలు, బ్యాటరీల కారణంగా దట్టమైన పొగ అలుముకుంది. ఈ ప్రమాదంలో ఊపిరి ఆడక లాడ్జిలో వసతి పొందుతున్న 8 మంది పర్యాటకులు ప్రాణాలు కోల్పోయారు.

2023 జనవరి 19, దక్కన్‌ మాల్​లో:దక్కన్‌ స్పోర్ట్స్‌ నిట్‌వేర్‌ కాంప్లెక్స్‌ సెల్లార్‌లోని దుకాణం నుంచి వెలువడిన మంటలు అలజడి సృష్టించాయి. నిమిషాల్లోనే మూడు వైపుల నుంచి మంటలు వ్యాపించి ఐదంతస్తులకు వ్యాపించాయి. ఉదయం 11 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు 120 మంది అగ్నిమాపక అధికారులు, సిబ్బంది నిర్విరామంగా కష్టపడితే తప్ప.. మంటలు మంటలు అదుపులోకి రాలేదు.

పక్క భవనాలకూ అగ్నికీలలు విస్తరించటంతో.. ఏకంగా 20కి పైగా ఫైర్‌ ఇంజిన్లతో తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. చివరకు సహాయక సిబ్బందే స్పృహ తప్పిన పరిస్థితి ఎదురైంది. ఈ ప్రమాదంలో ముగ్గురు సజీవ దహనం కావడంతో... వారి ఎముకలైనా దొరకని దుస్థితి నెలకొంది. వ్యాపార సముదాయంలో జరిగిన ప్రమాదంతో పక్కనున్న కాలనీలనే ఖాళీ చేయించే పరిస్థితి నెలకొంది.

2023 మార్చి 16, స్వప్నలోక్ కాంప్లెక్స్‌లో:నిత్యం రద్దీగా ఉండే ఈ కాంప్లెక్స్‌లో నిన్న జరిగిన భారీ అగ్నిప్రమాదం.. ఆరుగురిని బలితీసుకుంది. వస్త్ర దుకాణాలతో పాటు కంప్యూటర్ ఇనిస్టిట్యూట్లు, కాల్‌సెంటర్లు, ఇతర ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలతో సందడిగా ఉండే ఈ భవనంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ క్రమంలోనే పెద్దఎత్తున పొగ అలుముకోగా.. పెయింట్ డబ్బాలు లాంటివి పేలటంతో ప్రమాద తీవ్రత మరింత పెరిగింది. ఈ క్రమంలో 15 మందికి పైనే మంటల్లో చిక్కుకుపోయారు. సహాయక సిబ్బంది ఏడుగురుని అతి కష్టం మీద బయటికి తీసుకొచ్చారు. మరో అంతస్తులో చిక్కుకుని అస్వస్థతకు గురైన ఆరుగురిని గుర్తించారు. వారిని ఆస్పత్రికి తరలించినా ప్రాణాలు మాత్రం దక్కలేదు.

అధికారుల కఠిన చర్యలు తీసుకో లేనందునే: ఇలా ఆర్నెళ్ల కాలంలోనే ఒకే ప్రాంతంలో జరిగిన 3 భారీ అగ్నిప్రమాదాలు నగరవాసులను ఉలిక్కిపడేలా చేశాయి. భారీ ఆస్తి నష్టానికి తోడు అమాయకుల ప్రాణాలు మంటల్లో కలుస్తున్నాయి. ఈ దిశగా అప్రమత్త చర్యలు మాత్రం తీసుకుంటున్నట్లుగా కనిపించటం లేదు. ప్రమాదం జరిగినప్పుడు మంటలను అదుపుచేసేందుకు సహాయక సిబ్బంది తీవ్రంగా కష్టపడాల్సి వస్తోంది.

నిబంధనలు ఉల్లంఘించి ప్రమాదకర పరిస్థితుల్లో వ్యాపారాలు సాగుతున్నా.. కఠినంగా వ్యవహరించటంలో మాత్రం అధికార యంత్రాంగం విఫలమవుతోంది. అనుమతి లేని అంతస్తులు, గృహ అవసరాల కోసం నిర్మించిన ఇళ్లు భారీగా వ్యాపార సముదాయాలుగా మారడం, రోడ్ల ఆక్రమణ జరుగుతున్నా బల్దియా, పోలీసులు చూసీ చూడనట్లు వదిలేస్తున్నారు. స్థానికంగా కొందరు కిందిస్థాయి అధికారులకు ఆమ్యామ్యాలు అందుతుండటంతో ఈ పరిస్థితి నెలకొందనే ఆరోపణలు వస్తున్నాయి.

ఇప్పటికైనే అధికారులు మేల్కొవాలి: ప్రభుత్వం ఇప్పటికైనా మేల్కొని.. నిబంధనలకు విరుద్ధంగా సాగుతున్న వ్యాపార సంస్థలపై కఠినంగా వ్యవహరిస్తేనే భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం అయ్యే అవకాశం ఉండదని నగరవాసులు కోరుతున్నారు. ప్రమాదం జరిగాక హడావిడి చేయడం కన్నా.. ముందే అప్రమత్తమైతే ప్రాణాలతో పాటు ఆస్తినష్టం జరగకుండా కాపాడుకునే అవకాశం ఉంటుందని నిపుణులు అంటున్నారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details