BJP Protest against CM KCR Comments : రాజ్యాంగం పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యాఖ్యలను నిరసిస్తూ.... సికింద్రాబాద్‌లో భాజాపా చేపట్టిన ఆందోళన ఉద్రిక్తంగా మారింది. అంబేడ్కర్‌ను సీఎం కేసీఆర్ అవమానించారన్న భాజపా నాయకులు... భారత ప్రజానీకానికి సీఎం క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ నిరసనకు దిగారు. జబ్బార్ కాంప్లెక్స్ నుంచి భన్సీలాల్‌పేట వరకు భారీ ర్యాలీ చేపట్టారు. అయితే ధర్నాకు అనుమతి లేదంటూ పోలీసులు అడ్డుకున్నారు. పలువురిని అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు. ఈ క్రమంలో పోలీసులు, భాజపా కార్యకర్తల నడుమ స్వల్ప తోపులాట జరిగింది. పోలీసులు అరెస్టు చేస్తున్న క్రమంలో భాజపా మహిళా కార్యకర్త సొమ్మసిల్లి పడిపోయారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా భాజపా కార్యకర్తలు నినాదాలు చేశారు.
భాజపా నాయకులు, కార్యకర్తలు అరెస్ట్
అప్రజాస్వామిక ప్రభుత్వాన్ని గద్దె దింపేవరకూ తమ పోరాటం ఆగదని భాజపా నాయకులు మాజీ ఎమ్మెల్సీ రామచంద్రారావు వ్యాఖ్యానించారు. తెలంగాణ రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ నాశనం చేస్తూ, ప్రజలను మభ్యపెడుతున్నారని ఆరోపించారు. శాంతియుతంగా నిరసన దీక్ష చేస్తున్న తమపై పోలీసులు విచక్షణారహితంగా అరెస్టులకు పాల్పడడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. ప్రధాని నరేంద్ర మోదీపై ఇష్టారీతిగా మాట్లాడితే సహించేది లేదన్నారు. పదుల సంఖ్యలో భాజపా నాయకులు కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేసి... గాంధీ నగర్ పీఎస్‌కు తరలించారు.