Medical Education Seats In Telangana: రాష్ట్రంలో వైద్యవిద్య అభివృద్ధి దిశగా దూసుకెళ్తోంది. తెలంగాణ ప్రభుత్వం గత ఎనిమిదేళ్లలో బోధనాసుపత్రులకు అధిక ప్రాధాన్యమివ్వడంతో.. ప్రభుత్వ, ప్రైవేటు వైద్యకళాశాలల్లో గణనీయంగా సీట్లు పెరిగాయి. జిల్లాకు ఒక ప్రభుత్వ వైద్య కళాశాలను కొత్తగా నెలకొల్పడం, ప్రస్తుతమున్న సీట్లను పెంచడంపై సర్కారు దృష్టి పెట్టడంతో అత్యధిక ఎంబీబీఎస్ సీట్లున్న రాష్ట్రాల జాబితాలో తెలంగాణ 6,040 సీట్లతో ఆరో స్థానంలో నిలిచింది.
తొలి అయిదు స్థానాల్లో వరుసగా.. తమిళనాడు (10,825), కర్ణాటక (10,745), మహారాష్ట్ర (9,995), ఉత్తర్‌ప్రదేశ్ (9,053), గుజరాత్ (6,200) రాష్ట్రాలు ఉన్నాయి. 5,485 ఎంబీబీఎస్ సీట్లతో ఆంధ్రప్రదేశ్ ఏడో స్థానంలో నిలిచింది. అతి తక్కువ వైద్యసీట్లున్న రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో త్రిపుర (225), గోవా (180), చండీగఢ్ (150), సిక్కిం (150), దాద్రా నగర్ హవేలీ (150), అండమాన్ నికోబార్ దీవులు (100), మిజోరం (100), మేఘాలయ (50), అరుణాచల్‌ప్రదేశ్ (50) ఉన్నాయి. దేశవ్యాప్తంగా ఎంబీబీఎస్, పీజీ, సూపర్ స్పెషాలిటీ వైద్య సీట్ల వివరాలతో కూడిన నివేదికను కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ తాజాగా విడుదల చేసింది.
స్పెషాలిటీలో కర్ణాటక.. సూపర్ స్పెషాలిటీలో దిల్లీ అగ్రభాగాన:తెలంగాణ 2,477 పీజీ స్పెషాలిటీ సీట్లతో ఏడో స్థానంలో, 175 సూపర్ స్పెషాలిటీ సీట్లతో పదో స్థానంలో నిలిచింది. పీజీ స్పెషాలిటీ సీట్లలో తొలి అయిదు స్థానాల్లో కర్ణాటక (5,523), మహారాష్ట్ర (5,297), తమిళనాడు (4,159), ఉత్తర్‌ప్రదేశ్ (3,509), ఆంధ్రప్రదేశ్ (2,650) రాష్ట్రాలున్నాయి. సూపర్ స్పెషాలిటీ సీట్ల జాబితాలో ముందు వరుసలో దిల్లీ (703), తమిళనాడు (671), ఉత్తరాఖండ్ (581), కర్ణాటక (461), మహారాష్ట్ర (380) తొలి అయిదు స్థానాల్లో నిలిచాయి. దేశంలో ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో కలిపి.. అత్యధిక వైద్య కళాశాలలున్న రాష్ట్రాల జాబితాలో తమిళనాడు (71) ముందుండగా.. తర్వాత స్థానాల్లో వరుసగా కర్ణాటక (67), ఉత్తర్‌ప్రదేశ్ (67), మహారాష్ట్ర (63), తెలంగాణ (41), గుజరాత్ (36) రాష్ట్రాలున్నాయి.