Thanjavur painting: 'కళాకారుడిగా రాణిస్తున్న చిన్నపిల్లల వైద్యుడు' Dr. Srikanth Talent in Thanjavur Paintings: అతను ఒక డాక్టర్. రోజంతా ఆసుపత్రిలో పని చేసి సాయంత్రం ఇంటికి వచ్చే సరికి ఓపిక నశించినా నచ్చిన పని కోసం సాధన చేస్తున్నాడు. దక్షిణ భారతదేశ హస్త కళను తన వ్యాపకంగా మలుచుకున్నాడు. శాస్త్రీయ కళారూపమైన తంజావూరు పెయింటింగ్‌పై ఆసక్తి పెంచుకున్న ఆ యువకుడు.. కరోనా కాలంలో ఆ కళపై దృష్టి సారించి ఆహా అనిపిస్తున్నాడు.
చిన్నపిల్లలకి వైద్యుడిగా.. కాలక్షేపానికి చిత్రకారుడుగా: ఈ కళాకారుడి పేరు శ్రీకాంత్ కోన. చిన్నప్పటి నుంచి రామగుండం, ఉత్తర్‌ప్రదేశ్, చెన్నై, ముంబయిలో చదువు కొనసాగించాడు. చెన్నైలో ఎంబీబీఎస్ చేస్తున్న సమయంలో తమిళనాడులోని కళలపై అవగాహన ఏర్పరుచుకున్నాడు. ప్రస్తుతం హైదరాబాద్‌లోని ఓ ప్రముఖ ఆసుపత్రిలో చిన్నపిల్లల వైద్యుడిగా పనిచేస్తున్నాడు. కరోనా సమయంలోనే రోజూ ఆసుపత్రి నుంచి వచ్చిన తరువాత కాలక్షేపానికి తంజావూరు పెయింటింగ్ నేర్చుకున్నానని చెబుతున్నాడు.
Thanjavur Paintings in Hyderabad: మొదట ఆయిల్ పెయింటింగ్‌తో ప్రారంభించినా.. క్రమంగా శ్రీకాంత్‌కు తంజావూరు పెయింటింగ్‌పై ఆసక్తి పెరిగింది. అది నేర్చుకునేందుకు ఆన్‌లైన్‌లో తనకు కావలసిన సమాచారం అంతా సంపాదించాడు. స్నేహితుల సహాయంతో పెయింటింగ్ వేసేందుకు కావాలసిన టూల్స్, పెయింటింగ్ వేసే పద్ధతి తెలుసుకున్నాడు. చోళుల కాలంలో ఉన్న తంజావురు పేయింటింగ్ గురించి తన మాటల్లో చెబుతున్నాడు శ్రీకాంత్.
బంగారు రేకులతో డాన్సింగ్ సీత చిత్రం: డాక్టర్ వృత్తిలో ఉన్నందున ఏకధాటిగా పెయింటింగ్ పూర్తి చేయలేనప్పటికీ.. వీలైనంత సమయం చిత్రలేఖనానికి కేటాయిస్తున్నాడు. అలా బంగారు రేకులతో డాన్సింగ్ సీత చిత్రాన్ని పూర్తి చేశాడు. చూపరులను ఆకట్టుకునేలా ఉన్న ఆ ముగ్ధమనోహరమైన చిత్రాన్ని 8 నెలల్లో పూర్తి చేశాడు. ఆ చిత్రం తనకు చాలా ఇష్టమంటున్నాడు శ్రీకాంత్.
కళ్లుచెదిరే రంగులు, అందమైన అలంకరణలు, ముఖ్యంగా బంగారు రేకులను ఉపయోగిస్తూ తీర్చిదిద్దే దేవతల వర్ణనలకు ఈ పెయింటింగ్ ప్రసిద్ధి. ఈ కళారూపం సంవత్సరాలుగా అనేక మార్పులకు లోనవుతున్నా నిత్య నూతనత్వాన్ని సంతరించుకుంటుంది. మరి అలాంటి కళ వెనుక ఉన్న పద్ధతి ఏంటి..? అసలు బంగారు రేకులతో ఈ పెయింటింగ్‌ను ఎలా వేస్తారనేది వివరిస్తున్నాడు ఈ తంజావూరు చిత్రకారుడు.
అద్భుతమైన చిత్రాలను వేస్తున్న శ్రీకాంత్: తన చిత్రాలను ఆప్తులకు బహుమతులుగా అందజేస్తున్నాడు. అద్భుతమైన చిత్రాలను వేస్తున్న శ్రీకాంత్‌ను ఎవరూ అభినందించకుండా ఉండలేరు. తాను ఈ కళ నేర్చుకుంటున్నట్టు ఎవరికీ చెప్పకుండా హఠాత్తుగా ఒకరోజు వాళ్ల అమ్మకు చూపించడంతో ఆశ్చర్యపోవడం ఆమె వంతైంది. ఈ పేయిటింగ్స్ వల్ల తన మనసుకు హాయి కలుగుతుందంటున్నాడు శ్రీకాంత్.
తంజావూరు పెయింటింగ్‌ను హాబీగా చేసుకున్న డాక్టర్: తనలో ఇంత మంచి కళాకారుడు ఉన్నట్లు ఇన్నాళ్లు తెలియదంటూ ఆశ్చర్యపోతున్నారు శ్రీకాంత్ తల్లి. శ్రీకాంత్ తోబుట్టువు కూడా తమ్ముడిని చూసి మురిసిపోతోంది. దేశంలోనే కాదు ప్రపంచంలోనే ఆదరణ ఉన్న తంజావూరు పెయింటింగ్‌ను హాబీగా అవలీలగా నేర్చుకున్నాడు శ్రీకాంత్. భవిష్యత్తులో 6 అడుగులకన్నా ఎత్తైన పెయింటింగ్ వేసేందుకు ఆలోచిస్తానంటున్నాడు. అటు డాక్టర్‌గా ఇటు పేయింటర్‌గా రాణిస్తూ మరింత ముందుకెళ్లాలని మనమూ కోరుకుందాం.
'2019లో కరోనా టైంలో ఈ పెయింటింగ్స్‌ని స్టార్ట్ చేశాను. ఎందుకంటే ఆ టైంలో ఆసుపత్రికి వెళ్లడం.. అక్కడ పేషంట్స్ చూసుకోవడం ఇంటింకి వచ్చి మొత్తం ఇక రూంలో ఉండడమే. బయటకి వెళ్లడానికి ఆప్షన్స్ లేవు. బయట మొత్తం లాక్డౌన్ ఉంది. ఇక రూంలో ఒకటి ఒకటిగా స్టార్ట్ చేశాను. ముందు ఎవరికి రాదు. చాలా సార్లు ప్రాక్టీస్ చేసి.. మూడున్నర సంవత్సరాల తర్వాత ఇప్పుడు కొంచం పర్వాలేదు. ఆసుపత్రి నుంచి ఇంటికి వచ్చాక పెయింటింగ్ అనేది వేస్తే కొంచం రీలాక్స్గా అనిపిస్తుంది'. -డాక్టర్ శ్రీకాంత్, చిత్రకారుడు
ఇవీ చదవండి: