కొత్త కరెన్సీ నోట్లు మార్చి ఇస్తామంటూ బురిడీ.. రూ.కోటి 9 లక్షలతో పరార్.. చివరికి New Type of Fraud in Hyderabad: ఇప్పటి వరకు నకిలీ నోట్లు అంటగట్టడం.. కరెన్సీ మధ్యలో తెల్ల కాగితాలను ఉంచి మోసం చేయడం మాత్రమే చూశాం. కానీ హైదరాబాద్‌లో మరో కొత్త తరహా మోసం వెలుగులోకి వచ్చింది. కొత్త కరెన్సీ నోట్లు మార్చి ఇస్తామంటూ ఓ వ్యాపారిని బురిడీ కొట్టించిన ముఠాను.. గంటల వ్యవధిలో రాచకొండ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తికి చెందిన రోషన్ మెహబూబ్ పాత స్నేహితుల సహాయంతో ఆ పథకాన్ని అమలు చేశాడు.
Rachakonda Police Arrested Fraud Gang: నార్సింగికి చెందిన తాపీమేస్తీ శ్రీనివాస్, ఉప్పల్‌కు చెందిన ట్రావెల్స్ వ్యాపారి వాసు, నాగోల్‌కు చెందిన రాములుతో కలిసి కుట్రకు పాల్పడ్డాడు. పరిచయమున్న వ్యక్తి ద్వారా హైదరాబాద్‌లోని వ్యాపారి ప్రభాకర్ గౌడ్‌ను నమ్మించి మోసం చేసి పరారయ్యారు. ప్రధాన నిందితుడు రోషన్.. గతంలో దాదాపు రూ.32 లక్షల విలువైన నకిలీ నోట్లు ముద్రించి చలామణి చేస్తూ ఎల్బీనగర్ పోలీసులకు పట్టుబడ్డాడు. అరెస్టయినా నిందితుడు తీరు మార్చుకోలేదని పోలీసులు వెల్లడించారు.
20 శాతం కమీషన్ ఇస్తామన్న నిందితుల మాటలు నమ్మిన వ్యాపారి ప్రభాకర్ గౌడ్.. స్నేహితులు, బంధువుల దగ్గర నుంచి రూ.కోటి 9 లక్షలు సేకరించాడు. ముందస్తు ప్రణాళిక ప్రకారం.. శనివారం ఉదయం ఎల్బీనగర్ మెట్రోస్టేషన్ దగ్గర రూ.500 నోట్లను నిందితులకు ఇచ్చాడు. రూ.2000 నోట్లు తెచ్చి ఇస్తామని అక్కడే ఉంచి వెళ్లిన నిందితులు ఎంతకూ తిరిగి రాలేదు. అనుమానం వచ్చిన ప్రభాకర్.. ఫోన్ చేయగా స్విచ్ఛాఫ్ రావటంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. రంగంలోకి దిగిన ఎస్వోటీ పోలీసులు గంటల వ్యవధిలోనే నిందితులను అదుపులోకి తీసుకొని సొమ్మును స్వాధీనం చేసుకున్నారు. నోట్లు మారుస్తామని చెప్పే మోసగాళ్ల విషయంలో మరింత అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు.
వాళ్లు రకరకాల బాధితుల దగ్గర నుంచి డబ్బును సేకరించారు. రూ.2000 నోట్లను రూ.500తో మార్చుకుంటే 20 శాతం కమీషన్ ఇస్తామంటూ వారు మోసం చేసి పారిపోయారు. ఇది వినడానికి చాలా తేలికగా ఉంది. కానీ ఇందులో మనం గమనించాల్సింది ఏంటంటే.. రూ.2000 నోట్లు రద్దు అవుతుందని దుష్ప్రచారాలు చేస్తున్నారు. ఇలాంటి దుష్ప్రచారాలు ఎవరు చెప్పినా నమ్మొద్దు. నమ్మి ఇలాంటి మోసగాళ్ల చేతిలో పడి మోసపోవద్దు.-డీఎస్ చౌహాన్, రాచకొండ పోలీస్ కమిషనర్
ఇవీ చదవండి: