Covid Mock Drill : చైనా, జపాన్, దక్షిణ కొరియా, థాయిలాండ్, సింగపూర్, అమెరికా, బ్రెజిల్ తదితర దేశాల్లో తాజాగా కొవిడ్ కేసులు అమాంతంగా పెరుగుతుండడంతో.. నాలుగో దశ ముప్పు త్వరలోనే భారత్‌లోనూ విరుచుకుపడనుందా? అనే భయాందోళనలు మొదలయ్యాయి. కొవిడ్ విజృంభించే అవకాశాలున్నాయనే సందేశాలను కేంద్ర ప్రభుత్వం పంపిస్తోంది. అన్ని రాష్ట్రాలనూ అప్రమత్తం చేస్తోంది. ప్రజలు తప్పనిసరిగా కొవిడ్ నిబంధనలు పాటించాలనీ, సాధ్యమైనంత వేగంగా అర్హులైనవారందరూ బూస్టర్ డోసు టీకాలను పొందాలని ఆరోగ్యశాఖ సూచిస్తోంది. ఈ క్రమంలో మంగళవారం రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో కొవిడ్‌ను ఎదుర్కోవడంలో ప్రస్తుత సన్నద్ధతపై మాక్‌డ్రిల్ నిర్వహించనున్నారు.
అన్నీ సరిగానే ఉన్నాయా?:మూడోదశలో ప్రభుత్వ, ప్రైవేటులో కలుపుకొని మొత్తం 56 వేల 39 పడకలను సన్నద్ధం చేశారు. ప్రభుత్వ వైద్యంలోని దాదాపు 27 వేల 141 పడకలకు ఆక్సిజన్ సౌకర్యం ఏర్పాటు చేశారు. పిల్లలపై ఎక్కువ ప్రభావం ఉంటుందనే ప్రచారం నేపథ్యంలో.. ఎందుకైనా మంచిదనే ముందస్తు ఆలోచనతో నిలోఫర్ ఆసుపత్రిలో పడకల సంఖ్యను 1,000 పడకల నుంచి ఏకంగా 2,000 పడకలకు ప్రభుత్వం పెంచింది. ఇందులో 500 ఐసీయూ పడకలే ఉండడం విశేషం. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ఆసుపత్రుల్లోనూ కలుపుకొని సుమారు 6వేల పడకలను పిల్లల చికిత్స కోసమే కేటాయించింది.
గత 8 నెలలుగా ప్రాణ వాయువు సౌకర్యాలను తగినంతగా వాడుకోవడం లేదు. దీంతో వీటిని అత్యవసరంగా వాడాల్సి వస్తే ఆ ఆక్సిజన్ లైన్లు పనిచేస్తాయా? అన్ని పడకలకూ ప్రాణవాయువు అందుతుందా? అనేది సరిచూడనున్నారు. సుమారు 5వేల ఐసీయూ పడకలుండగా.. వీటిలో వెంటిలేటర్లు, సీపాప్, బైపాప్, హై ఫ్లో నాసల్ క్యానళ్లు.. తదితర పరికరాలు పనిచేస్తున్నాయా? అనేది కూడా చెక్ చేస్తారు. 6వేల చిన్నారుల పడకల్లో ప్రాణవాయువు సౌకర్యంతో పాటు 1 వేయి 875 ఐసీయూ పడకలుండగా.. వాటి పనితీరు సమర్థంగా ఉందా? అనేది కూడా పరిశీలిస్తారు.