హైదరాబాద్‌తో పాటు చుట్టుపక్కల జిల్లాల్లో నకిలీ వైద్యుల అవతారమెత్తుతున్న కొందరి కారణంగా రోగుల ప్రాణాలు ప్రశ్నార్థకమవుతున్నాయి. తప్పుడు ధ్రువపత్రాలను సృష్టించి మల్టీస్పెషాల్టీ ఆస్పత్రులను ఏర్పాటు చేస్తున్నారు. ప్రముఖ ఆస్పత్రుల్లో నర్సింగ్ సిబ్బందిగానో, వార్డు బాయ్‌లుగానో పని చేసిన వారే ఈ అవతారం ఎత్తుతున్నారు. ఏకంగా శస్త్రచికిత్సలు చేయడానికి సాహసిస్తున్నారు. ఫలితంగా ఎంతోమంది రోగులు తీవ్రమైన అనారోగ్యానికి గురై చావుకు దగ్గరైన సందర్భాలున్నాయి. ఇంత జరుగుతున్నా వైద్య ఆరోగ్యశాఖకు చీమకుట్టినట్లుగా ఉండడంలేదు. దీనిపై పెద్దఎత్తున విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
- మహబూబ్‌నగర్ రాజేంద్రనగర్‌కు చెందిన పి.సాయికుమార్(35) ఓ ఆస్పత్రిలో ఆపరేషన్ థియేటర్ అసిస్టెంట్‌గా పనిచేశాడు. ఎంబీబీఎస్, ఎండీ పూర్తి చేసినట్లు చెప్పుకొని 2013లో మీర్పేట్ ఎక్స్ రోడ్డులో ‘సాయి క్లినిక్’ ప్రారంభించాడు. ఇతను కేవలం ఇంటర్ చదివాడు. ఇతను చేసిన వైద్యంతో ఇటీవల ఓ కొవిడ్ రోగి మృతి చెందాడు. విషయాన్ని పోలీసుల దృష్టికి రావడంతో అరెస్ట్ చేశారు.
- అయిదో తరగతితో చదువు ఆపేసిన వైఎస్ తేజ అలియాస్ వీరగంధం తేజ(23) ఏకంగా రాచకొండ పోలీస్ ఉన్నతాధికారులకే షాక్ ఇచ్చాడు. డాక్టర్‌నని చెప్పుకొని కొవిడ్ బారిన పడిన పోలీస్ సిబ్బందికి వైద్యం చేశాడు. పోలీసుల పేర్లతో సెటిల్మెంట్లు చేస్తున్నాడనే ఆరోపణలు రావడంతో ఉన్నతాధికారులు అప్రమత్తమై ఆరా తీయగా అసలు సంగతి బయటపడింది. ఛత్తీస్‌గఢ్ రాయ్‌పూర్‌లోని వర్సిటీ నుంచి నకిలీ ఎంబీబీఎస్ పట్టా పొందినట్లు గుర్తించారు. అతడ్ని అరెస్టు చేసి పీడీ చట్టాన్ని ప్రయోగించారు.
- షాద్‌నగర్‌కు చెందిన ప్రవీణ్ కొన్ని ఆస్పత్రుల్లో వార్డు బాయ్‌గా పని చేశాడు. శంషాబాద్‌కు చెందిన వైద్యుణ్ని పరిచయం చేసుకుని తానూ డాక్టర్నేనని నమ్మించాడు. ఆ వైద్యుడి ఎంబీబీఎస్ సర్టిఫికెట్తో షాద్‌నగర్‌లో ఆస్పత్రికి అనుమతి పొందాడు. గత ఏడాది అమ్మ మల్టీస్పెషాలిటీ ఆసుపత్రిని ఏర్పాటు చేశాడు. కొద్ది రోజులకు అసలు విషయం తెలిసి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ నకిలీ బాగోతం బయటపడింది. పరారైన ఆ నకిలీ వైద్యుణ్ని అరెస్టు చేయవద్దంటూ కీలకమైన ఓ ప్రజాప్రతినిధి ఒత్తిడి తేవడంతో ఇప్పటి వరకు చర్య తీసుకోకపోవడం గమనార్హం.
సర్టిఫికెట్లు దిల్లీ నుంచే...
ఎంబీబీఎస్ నకిలీ సర్టిఫికెట్ల జారీలో దిల్లీకి చెందిన ఎస్ఎస్ కన్సల్టెన్సీ ప్రధాన పాత్ర పోషిస్తోందని పోలీసుల దర్యాప్తులో బయటపడింది. ఒకటి, రెండ్రోజులు సమయమిస్తే చాలు.. ఏ సర్టిఫికెట్ కావాలంటే అది ఇచ్చేస్తున్నారని గుర్తించారు.
పేరులో ఒకటి.. లోపల మరొకరు