తెలంగాణ

telangana

ETV Bharat / state

KRMB: హంద్రీనీవా విస్తరణ పనులు ఆపాలంటూ కేఆర్​ఎంబీకి లేఖ - telangana latest news

krmb
కృష్ణా నదీ యాజమాన్య బోర్డు ఛైర్మన్​కు తెలంగాణ ప్రభుత్వం లేఖ

By

Published : Mar 10, 2022, 6:14 PM IST

Updated : Mar 10, 2022, 9:17 PM IST

18:11 March 10

krmb: ఆ ప్రాజెక్టు విస్తరణ పనులు ఆపాలంటూ కేఆర్​ఎంబీకి లేఖ

krmb: కృష్ణానదీ యాజమాన్య బోర్డుకు రాష్ట్ర ప్రభుత్వం మరో లేఖ రాసింది. ఏపీ చేపట్టిన హంద్రీనీవా విస్తరణ పనులు ఆపాలంటూ లేఖలో కోరింది. ఈ మేరకు కేఆర్ఎంబీ ఛైర్మన్‌కు ఈఎన్‌సీ మురళీధర్ లేఖ రాశారు.

హంద్రీనీవా విస్తరణ ఆపాలని విజ్ఞప్తి

కర్నూలు జిల్లాలోని హంద్రీనీవా ద్వారా కేసీ కెనాల్‌కు నీరు మళ్లించడాన్ని ఆపాలని ఈఎన్‌సీ మురళీధర్ విజ్ఞప్తి చేశారు. అలాగే బనకచెర్ల క్రాస్ రెగ్యులేటర్ నుంచి ఎస్కేప్ ఛానల్ పనులనూ ఆపాలంటూ లేఖలో పేర్కొన్నారు. మిగులు జలాల ఆధారంగా నిర్మించిన హంద్రీనీవా రెండో దశ ప్రధాన కాల్వ నుంచి గ్రావిటీ ద్వారా 195 చెరువులను నింపేందుకు ఏపీ ప్రభుత్వం ఇటీవల టెండర్ నోటీసు జారీ చేసింది. అయితే కృష్ణా నుంచి కేటాయింపులకు మించి జలాలను ఏపీ తీసుకుంటోందని.. 34 టీఎంసీలకు మించి వినియోగించుకునే అవకాశం లేదని గతంలోనే బోర్డు దృష్టికి తీసుకెళ్లినట్లు లేఖలో పేర్కొన్నారు. అనుమతుల్లేకుండా కృష్ణా బేసిన్ బయట ఏపీ పలు ప్రాజెక్టులు చేపట్టిందని.. వాటికి కేఆర్ఎంబీ, ఎపెక్స్ కౌన్సిల్ అనుమతుల్లేవని గుర్తు చేశారు.

మిగులు జలాల ఆధారంగా కేటాయింపులు

మిగులు జలాల ఆధారంగా తాము నిర్మిస్తున్న ప్రాజెక్టులకు నీటి కేటాయింపులు చేయాలని కృష్ణా జలవివాదాల రెండో ట్రైబ్యునల్​ను తాము కోరామని.. ఏపీ కనీసం ఈ కేసులో భాగస్వామి కాలేదని ఈఎన్సీ మురళీధర్ లేఖలో ప్రస్తావించారు. వీటన్నింటి నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం హంద్రీనీవాపై చేపట్టిన విస్తరణ పనులు, కేసీ కాల్వకు కృష్ణ జలాల మళ్లింపు, బనకచర్ల క్రాస్ రెగ్యులేటర్ కింద ఎస్కేప్ ఛానళ్ల పనులను తక్షణమే అడ్డుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం కృష్ణా బోర్డును కోరింది.

ఇరు రాష్ట్రాల వాదనలు

అటు వేసవి అవసరాల కోసం రెండు రాష్ట్రాలకు కృష్ణా జలాల విడుదలకు సంబంధించిన అంశాలపై కేఆర్ఎంబీ త్రిసభ్య కమిటీ వర్చువల్ విధానంలో సమావేశమైంది. బోర్డు సభ్యకార్యదర్శి రాయిపురే నేతృత్వంలో జరిగిన సమావేశంలో రెండు రాష్ట్రాల ఇంజనీర్లు పాల్గొన్నారు. శ్రీశైలంలో తక్కువ నీరు ఉన్నప్పటికీ జలవిద్యుత్ ఉత్పత్తి చేసి దిగువకు నీరు వదలడంపై రెండు రాష్ట్రాలు పరస్పరం వాదించుకున్నట్లు తెలుస్తోంది.

శ్రీశైలం జలాశయంలో నీరు లేనందున ఎడమగట్టు విద్యుత్ ఉత్పత్తి కేంద్రం ద్వారా రివర్స్ పంపింగ్ చేసుకొని కల్వకుర్తి ఎత్తిపోతల అవసరాలు తీర్చుకుంటామని తెలంగాణ ఇంజనీర్లు చెప్పినట్లు తెలిసింది. అటు నాగార్జునసాగర్ నుంచి తమకు 30 టీఎంసీలకు కావాలని ఆంధ్రప్రదేశ్ కోరింది. అయితే ఏపీ వాటా 22 టీఎంసీలకు మించి లేదని అన్నట్లు తెలుస్తోంది. అటు సాగర్​లో లభ్యత ఉన్న నీరంతా తమకే చెందుతుందని.. తమ అవసరాలకు అనుగుణంగా వినియోగించుకుంటామని తెలంగాణ ఇంజనీర్లు బోర్డుకు తెలిపారు. రెండు రాష్ట్రాల వాదనలు విన్న కృష్ణా నదీ యాజమాన్య బోర్డు... అందుబాటులో ఉన్న జలాలను పరిగణలోకి తీసుకొని నీటి విడుదల ఉత్తర్వులు జారీ చేయనుంది.

ఇదీ చూడండి:

Last Updated : Mar 10, 2022, 9:17 PM IST

ABOUT THE AUTHOR

...view details