ఆయనో చోటా నాయకుడు.. రాజకీయ పర్యటనలో అతడి సెల్‌ఫోన్ మాయమైంది. దాని ఖరీదు రూ.20,000. దాన్ని తెచ్చి అప్పగిస్తే రూ.50,000 బహుమతి అంటూ అనుచరులకు బంపర్ ఆఫర్ ఇచ్చాడు. ఇటీవల ఎస్.ఆర్.నగర్ పరిధిలో చోటుచేసుకున్న సంఘటన. ప్రజాప్రతినిధితో కలిసి వినోద వేడుకల్లో పాల్గొన్న ఫొటోలు అందులో ఉండటమే బాధితుడి ఆందోళనకు కారణమని తెలుస్తోంది.
ప్రతి ఒక్కరూ మొబైల్ ఫోన్‌లో వాహన పత్రాలు, బ్యాంకు లావాదేవీలు, వ్యక్తిగత వివరాలు భద్రపరచుకుంటున్నారు. అంత విలువైన ఫోన్ ఒక్క నిమిషం కనిపించకపోతే ఉక్కిరిబిక్కిరే. ఇక చోరీకి గురైతే చెప్పక్కరలేదు. యువకులు, రాజకీయ నాయకులు మానసిక ఒత్తిడికి గురవుతున్నారు. ఇటీవల రాచకొండ పరిధిలో ఓ నాయకుడి ఫోన్ మాయమైంది. దాన్ని వెతికి తీసుకురమ్మంటూ పోలీసులపై తీవ్ర ఒత్తిడి తీసుకొచ్చినట్టు సమాచారం. ఫోన్ కొట్టేసిన వ్యక్తి దాన్ని రూ.3,000కు ఓ మహిళకు విక్రయించాడు. ఐఎంఈఐ ట్రాకింగ్‌లో పోలీసులు ఆ ఫోన్‌ను గుర్తించి సదరు నాయకుడికి అప్పగించారు. ఆయన గోవా వెళ్లినప్పటి ఫొటోలు అదే ఫోన్‌లో ఉండటమే ఆందోళనకు కారణమని తేలింది.
ఆవేదనకు అసలు కారణం..:గ్రేటర్ పరిధి మూడు పోలీసు కమిషనరేట్ల పరిధిలో రోజూ సెల్‌ఫోన్లు మాయమైనట్టు 30-40 ఫిర్యాదులు అందుతుంటాయి. ఐటీ సెల్‌లో బాధితుల సెల్‌ఫోన్ ఐఎంఈఐ నంబరు ఆధారంగా ట్రాకింగ్ ఉంచుతారు. సిమ్‌కార్డు మార్చి ఫోన్ ఉపయోగించగానే వివరాలను పోలీసులు గుర్తిస్తారు. దాని ఆధారంగా ఫోన్లను స్వాధీనం చేసుకొని బాధితులకు అప్పగిస్తున్నారు. ఈలోగా గుబులు పడుతూ ఠాణాల చుట్టూ చక్కర్లు కొడుతూ.. పోలీసులపై ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఇందుకు వ్యక్తిగత ఫొటోలు, వీడియోలు అందులో ఉండటమే కారణమని పోలీసులు అంచనా వేస్తున్నారు.
*దేశ, విదేశాల్లో వేడుకల్లో పాల్గొనటం, ప్రేమికులతో ఏకాంతంగా ఉన్నప్పుడు తీసుకొన్న ఫొటోలు, అనైతిక సంబంధాలతో గుట్టుగా తీసిన వీడియోలను అధిక శాతం మొబైల్ ఫోన్లలోనే భద్రపరచుకుంటున్నారు. ఫోన్లు మాయమైనప్పుడు.. ఆ గుట్టంతా బయటపడుతుందనే ఆందోళనకు గురవుతున్నారు. 4 నెలల క్రితం సైబరాబాద్ పోలీసులు కరడుగట్టిన దొంగను అరెస్ట్ చేశారు. అతడి వద్ద నుంచి 10 ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. వాటిలో 7 ఫోన్లలో అశ్లీల ఫొటోలు, వీడియోలు ఉన్నట్టు గుర్తించారు.