హైదరాబాద్ గోల్కొండ పోలీస్ స్టేషన్ పరిధిలోని మోతెదర్వాజా ప్రాంతంలో దారుణం జరిగింది. కట్టుకున్న భార్యను అతికిరాతకంగా నరికి చంపాడో భర్త. భార్యపై అనుమానంతో పథకం ప్రకారం ఆమెను కడతేర్చి నలుగురు పిల్లలను రోడ్డున పడేశాడు. జీవితాంతం తోడుంటానని చేసిన ప్రమాణాన్ని కాలరాసి క్రూరమృగంగా మారాడు.
అసలేంజరిగింది
మోతెదర్వాజాకు చెందిన బషీర్ క్యాబ్ డ్రైవర్గా పనిచేస్తున్నాడు. ఇతనికి ఇద్దరు భార్యలు. రెండో భార్య సమీరా బేగంతో కలిసి ఉంటున్నాడు. వీరికి నలుగురు పిల్లలున్నారు. తాగుడుకు బానిసైన బషీర్ భార్యపై అనుమానంతో తరచూ గొడవపడుతూ ఉండేవాడు. ఈ క్రమంలో భర్తపై పోలీసులకు ఫిర్యాదు చేసింది సమీర. పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చి పంపించారు. అయినప్పటికీ అతని వక్రబుద్ధి మారలేదు. భార్యను ఎలాగైనా అంతమొందించాలని పథకం వేసి అతికిరాతకంగా నరికి కడతేర్చాడు.