"రోజంతా టీవీయేనా... వేరే వ్యాపకమే లేదా...? ఇలా వచ్చి కూరగాయలు కోయొచ్చుగా.." అంటూ వంటింట్లో నుంచి అమ్మ అరుపు. "అయితే టీవీ.. లేకపోతే ఫోన్... ఇంతేనా... అమ్మకు వంటలో సాయం చేస్తే భవిష్యత్తులో పనికొస్తది కదా" అని నాన్న సలహా. ఇలాంటి డైలాగులు ప్రస్తుతం అన్ని ఇళ్లల్లో వినిపిస్తూనే ఉంటాయి.
తల్లిదండ్రులు మందలించినందుకు బాలిక ఆత్మహత్య - crime news
పిల్లలు సోమరులుగా తయారవకుండా... ఏదో ఓ పనిలో బిజిగా మార్చాలని తల్లిదండ్రులు చూస్తుంటారు. దాని వెనక.. తమ పిల్లలు ఆ పని నేర్చుకోవాలనే ఆరాటం... యాక్టివ్గా ఉండాలనే ఆతృత ఉంటుంది. కానీ... కొందరు పిల్లలు దాన్ని తప్పుగా అర్థం చేసుకుని.. తల్లిదండ్రుల మీద ద్వేషంతో విలువైన జీవితాలను మధ్యలోనే ఆపేస్తున్నారు.
తల్లిదండ్రులు చిన్న చిన్న పనులు చెప్పినా... అవేవీ పట్టించుకోకుండా వారి వ్యాపకాల్లో నిమగ్నమైపోతే మందలించటం సర్వసాధారణం. హైదరాబాద్ జూబ్లీహిల్స్ పీఎస్ పరిధిలోని అజామ్నగర్లో విషాదం జరిగింది. ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు జిల్లాకు చెందిన కందుకూరి రవి, సుందర్ లీలకు ఇద్దరు కుమార్తెలు, ఓ కొడుకు ఉండగా... పెద్ద కూతురికి పెళ్లైపోయింది.
కరోనా దృష్ట్యా విద్యాసంస్థలు తెరుచుకోకపోవటం వల్ల పదో తరగతి చదువుతున్న చిన్న కూతురు ఇంటికే పరిమితమైంది. ఇంట్లో ఉన్నప్పుడు చిన్నచిన్న పనులు చేయాలని తల్లి పలు మార్లు సూచించింది. ఆ బాలిక ఎలాంటి పని చేయకపోవటం వల్ల... చెప్పిన పని చేయకుండా టీవీకే పరిమితమవుతున్నావని తల్లి మందలించింది. ఆ మాటలకు తీవ్ర మనస్తాపం చెందిన బాలిక ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. అల్లారుముద్దుగా పెంచుకుంటున్న ఆ తల్లిదండ్రులకు కడుపుకోత మిగిల్చింది.