సామాజిక మాధ్యమం ద్వారా మైనర్ బాలికను వేధిస్తున్న ఓ యువకుడిని సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. నిజామాబాద్ జిల్లా పాల్దా గ్రామానికి చెందిన సందీప్ (27) ఇంజినీరింగ్ పూర్తి చేశాడు. అమెరికాలోని కాలిఫోర్నియాలో ఉండే 12 ఏళ్ల బాలికను ఇన్ స్టాగ్రామ్ ద్వారా పరిచయం చేసుకున్నాడు. ఆమెతో చాటింగ్ చేస్తూ వ్యక్తిగత ఫొటోలు, నగ్నంగా ఉన్న ఫోటోలు సైతం తీసుకున్నాడు. తర్వాత బెదిరింపులకు దిగాడు. నగ్న దృశ్యాలు మరిన్ని పంపించాలంటూ ఒత్తిడి చేశాడు. దీంతో బాలిక ఇతని ఖాతాను బ్లాక్ చేసింది.
అంతటితో ఊరుకోకుండా బాలిక స్నేహితురాలికి నగ్న ఫొటోలు పంపించి... బాలిక తనతో మాట్లాడాలని.. లేకపోతే ఆమె ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో పెడతానని భయపెట్టాడు. దీంతో బాలిక తిరిగి సందీప్‌తో మాట్లాడటం మొదలు పెట్టింది. సందీప్ వేధింపులు ఎక్కువ కావడం వల్ల విసిగివేసారిన బాలిక తన తల్లిదండ్రులకు ఈ విషయం చెప్పింది. తల్లిదండ్రులు వెంటనే ఆన్లైన్ ద్వారా సైబరాబాద్ సైబర్ క్రైం పోలీసులను సంప్రదించారు. తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టిన పోలీసులు నిజామాబాద్‌కు చెందిన సందీప్‌ను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.