తెలంగాణ

telangana

ETV Bharat / state

సంక్రాంతి స్పెషల్​: ఆహా ఏమి రుచి.. తినరా మైమరచి.! - సంక్రాంతికి ఏ పిండి వంటకాలు

సంక్రాంతి పండగ వచ్చిందంటే చాలు ఆడవాళ్లు పాకశాలల్లో తమ వంటకాల ప్రావీణ్యాన్ని చూపిస్తారు. రకరకాల పిండి వంటలతో పండగకు వారం రోజుల నుంచే హడావిడి చేస్తారు. వీరి చేతులతో ఈ మూడ్రోజులూ నోరూరించే పిండి వంటలూ, కాలానుగుణంగా పండే పంటలూ రుచి చూడకుండా ఉండలేం. మితంగా తింటే చాలు బోలెడు పోషకాలను అందిస్తాయివి. మరి అవేంటో ఆ ప్రయోజనాలేంటో తెలుసుకుందామా!

resipies
వంటకాలు

By

Published : Jan 14, 2023, 12:03 PM IST

పెద్ద పండగకు వారం రోజులు ముందు నుంచే మహిళామణులు గుమగుమలాడే పిండి వంటలను సిద్ధం చేస్తారు. మగ మహారాజులు తమ చిరకాల స్నేహితులతో బిజీగా ఉంటే.. మహిళలు పాకశాలల్లో వంటల తయారీలో నిమగ్నమై ఉంటారు. వారు తయారు చేసిన పిండి వంటలు బోలెడు పోషకాలను అందిస్తాయి. అవేంటో ఒకసారి ఓ లుక్కేద్దామా మరీ.!

పరమాన్నం/పొంగలి:సంక్రాంతి నాడు పరమాన్నం/పొంగలి తప్పనిసరిగా వండుకుంటాం. పాలూ, బెల్లం, బియ్యం, యాలకులపొడి వేసి చేసే ఈ వంటకం ఉడికేటప్పుడు గరిటెకు బదులు చెరకు ముక్కలతో తిప్పుతూ ఉంటారు. దీంతో దీనికి మరింత రుచి వస్తుంది. చెరకు జీర్ణశక్తికి మేలు చేస్తుంది. ఒంట్లోని వేడిని తగ్గిస్తుంది. ఇందులో వాడే పాల నుంచి క్యాల్షియం, ఫాస్ఫరస్‌ మెగ్నీషియం... తక్షణ శక్తిని అందిస్తాయి. ఎముకలూ, దంతాల ఆరోగ్యానికి మేలు చేస్తాయి. ఇక, ఉడికించిన అన్నం నుంచి జింక్‌, మాంగనీస్‌ అధికంగా లభిస్తాయి. పరమాన్నంలో బెల్లందే కీలక పాత్ర. ఇందులోని ఖనిజాలు రోగ నిరోధక శక్తిని పెంచి, జీర్ణవ్యవస్థను మెరుగ్గా పనిచేసేలా చేస్తాయి. రక్తహీనతనూ దరిచేరనివ్వవు. యాలకులు నోటి దుర్వాసన దూరం చేస్తాయి.

అరిసెలు:సంక్రాంతి పండగ వచ్చిందంటే చాలు మొదట గుర్తొచ్చేవి అరిసెలే.. బెల్లంతో చేసిన అరిసెలు ఆరోగ్యానికి శ్రేష్టం. వీటి తయారీలో కొత్త బియ్యపు పిండి, నూనె, బెల్లం, నువ్వులు వాడతారు. ఇందులో వాడే బెల్లం రక్తాన్ని శుద్ధి చేయడంతోపాటు శరీరంలో ఉన్న వ్యర్థాలను తొలగిస్తాయి. వీటిలో కార్బొహైడ్రేట్లు అధికంగా ఉంటాయి. ఐరన్‌తో పాటు పలు పోషకాలూ శరీరానికి లభిస్తాయి.

సున్నుండలు:పండక్కి వచ్చే కొత్త అల్లుళ్లను మెప్పించడానికే కాదు... ఆటలతో అలసిపోయే చిన్నారులకూ, పనులతో ఒత్తిడికి గురయ్యే మహిళలకూ తక్షణ శక్తినీ, పోషకాలనూ పుష్కలంగా అందించే స్వీటు సున్నుండ. దీని తయారీకి వాడే మినపప్పులో శరీరానికి కావలసిన ప్రొటీన్లూ, కొవ్వులూ, కార్బోహైడ్రేట్లూ పుష్కలంగా దొరుకుతాయి. ఇవి రోజంతా ఉత్సాహంగా ఉండగలిగే శక్తిని అందిస్తాయి. శరీర జీవక్రియా రేటుని మెరుగుపరుస్తాయి. బెల్లం రక్తాన్ని శుద్ధిచేస్తే, నెయ్యి ద్వారా ప్రొటీన్లు, అందుతాయి. హోర్మోన్లను సమతుల్యంగా ఉంచడంలో సున్నుండలు బాగా పనిచేస్తాయి.

గారెలు:పెద్ద పండక్కి చేసుకునే పిండివంటల్లో గారెలు లేకపోతే ఎలా? చిల్లు గారెల్ని నాటుకోడి మాంసంతో నంజుకుని తింటుంటే ఆ రుచే వేరు కదా! చికెన్‌ సంగతి అలా ఉంచితే గారెల రుచీ, పోషకాల గురించి ఎంత చెప్పినా తక్కువే. మాంసకృత్తులతో పాటూ ఖనిజాలూ ఎక్కువ మోతాదులో ఉండే ఇవి రెండు తింటే చాలు పొట్ట నిండిన భావన కలుగుతుంది. అచ్చంగా మినపప్పుతో చేసే ఇవి తక్షణ శక్తినీ, ఎముక, కండరాలకూ బలాన్నిస్తాయి.

గుమ్మడి పులుసు/కలగూర కూర:సాధారణంగా ఎప్పుడూ గుర్తుకురాని గుమ్మడి చాలా ప్రాంతాల వారికి సంక్రాంతి పండక్కి కచ్చితంగా గుర్తొస్తుంది. పోషకాలన్నీ పొట్టలో నింపేసుకొన్న ఈ కాయతో పులుసూ, కూర వంటివి చేస్తారు. దీనిలో మెగ్నీషియంతో పాటూ ఐరన్‌, విటమిన్‌ ఎ, డి, ఇ, కె వంటివెన్నో దొరుకుతాయి. హార్మోన్లను సమతుల్యం చేసి రోగనిరోధక వ్యవస్థని బలపరుస్తాయి. ఇక, కొన్ని ప్రాంతాల్లో కలగూరనూ వండుతారు. ఈ కాలంలో దొరికే కూరగాయలన్నీ కలిపి వండటం వల్ల విటమిన్లూ, పోషకాలూ, ఖనిజాలు వంటివన్నీ శరీరానికి సక్రమంగా అందుతాయి. ఇవి జీవ క్రియలు చక్కగా జరిగేలా చూస్తాయి.

జంతికలు:అన్నీ తీపి పదార్థాలే తిన్నప్పుడు...జిహ్వకు కాస్త కారం తగిలితే బాగుండును అనిపిస్తుంది. అలాంటివారికి పండగ పూట వెంటనే గుర్తొస్తాయి జంతికలు. ఇందులో వాడే శనగ పిండి, బియ్యపు పిండి కార్బోహైడ్రేట్లను, ప్రోటీన్లను అందిస్తే నువ్వులు ఇనుమూ, క్యాల్షియం వంటి ఖనిజాల్ని అందిస్తాయి. ఇక ఇందులో ఉపయోగించే కారం నుంచి విటమిన్‌ ఎ, సిలు రోగ నిరోధక శక్తిని పెంచడంలో కీలకంగా పనిచేస్తాయి.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details