హైదరాబాద్ మహా నగర రాజకీయ ముఖ చిత్రం మారబోతోంది. జీహెచ్ఎంసీ కొత్తచట్టం వచ్చాక రాజధానిలో డివిజన్ల సంఖ్యను పెంచాలని యంత్రాంగం ప్రణాళిక రచిస్తోంది. కనీసం ప్రతి 50 వేల మంది జనాలకు ఓ డివిజన్ ఉండాలని భావిస్తోంది. ప్రస్తుతం 150 డివిజన్ల పరిధిలో దాదాపు కోటి మంది జనాభా ఉండటం గమనార్హం. ఆ లెక్కన డివిజన్లు 180 నుంచి 200కు పెరిగే అవకాశముంది. నవంబరు వరకు ఈ ప్రక్రియను ముగించి, వెంటనే జీహెచ్ఎంసీ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల చేయాలనేది ప్రణాళిక.
ఇప్పటిదాకా జరిగిందేమిటంటే
హైదరాబాద్ మహానగర పాలక సంస్థ 2007లో ఆవిర్భవించింది. చుట్టూ ఉన్న 12 పురపాలక సంస్థల విలీనంతో మహానగరంగా అవతరించింది. 2009లో 150 డివిజన్లకు ఎన్నికలు జరిగాయి. పాలక మండలి గడువు 2014లో ముగిసింది. అప్పటికే గ్రేటర్లో డివిజన్లను పెంచాలని పలువురు కోర్టును ఆశ్రయించారు. 2001 జనాభా లెక్కలతో 2009లో జీహెచ్ఎంసీ ఎన్నికలు జరిగాయని, 2011 లెక్కల ప్రకారం గ్రేటర్లో 67 లక్షల మందికి 172 డివిజన్లు ఉండాలని ప్రభుత్వాన్ని న్యాయస్థానం ఆదేశించింది. ఈ బాధ్యతను సర్కారు బల్దియాకు అప్పగించింది. సగటున 40 వేల మంది జనాభా ప్రాతిపదికన 172 డివిజన్లు అవసరమవుతాయని బల్దియా కమిషనర్... ప్రభుత్వానికి తెలిపారు.