తెలంగాణ

telangana

ETV Bharat / state

ఆత్మస్థైర్యమే ఊపిరి: కరోనాను జయించిన కుటుంబ గాధ

హైదరాబాద్ నగరంలో ఓ సంస్థలో పని చేసే ఉద్యోగి ఆయన. కొద్దిరోజుల క్రితం కొవిడ్ బారిన పడ్డారు. అనుమానంతో కుటుంబ సభ్యులకు పరీక్షలు చేయించగా వారికి వైరస్ నిర్ధరణ అయింది. ఒక్కసారి వారందరూ ఉలిక్కిపడ్డారు. కానీ అందరూ క్షేమంగా మహమ్మారి నుంచి కోలుకున్నారు. అందుకు కారణం మనోధైర్యమే అంటున్నారు ఆ కరోనా యోధులు. కుటుంబ సభ్యులు, స్నేహితుల ఆత్మీయత అవసరమే అని చెబుతున్నారు. కరోనా నుంచి ఆ కుటుంబం ఎలా బయటపడిందో తెలుసుకుందాం రండి...

corona latest news,  corona recovery facts
కరోనా యోధుల స్టోరీ, కరోనాను ఎదుర్కోవాలంటే ఆత్మస్థైర్యమే కావాలి

By

Published : Apr 26, 2021, 10:41 AM IST

చుట్టూ ప్రతికూల వాతావరణం ఉన్నా మనోధైర్యం, కుటుంబసభ్యులు, స్నేహితులు పంచిన ఆత్మీయత తమను కరోనా గండం నుంచి గట్టెక్కించిందంటున్నారు కూకట్‌పల్లికి చెందిన ఓ ప్రైవేటు ఉద్యోగి. స్థానికంగా ఓ సంస్థలో పనిచేసే అతడికి కొద్దిరోజుల కిందట పాజిటివ్‌గా తేలింది. భార్య, ఇద్దరు పిల్లలకూ పరీక్షలు చేయించగా భార్య, కూతురు కరోనా బారినపడినట్టు తేలింది. కుమారుడు ఆరోగ్యంగా ఉన్నాడు. విషయాన్ని ఇంటి యజమానికి ఫోన్‌ చేసి చెప్పాడు. కుటుంబంతో సొంతూరు వెళ్లిన ఇంటి యజమాని పూర్తి భరోసానిచ్చాడు. ‘భయపడొద్ధు. అవసరమైతే మా ఇంటి తాళం పగులగొట్టి వాడుకోమంటూ' ధైర్యాన్నిచ్చాడు. యజమాని ఓదార్పు మాటలు ఆ కుటుంబానికి మరింత ధైర్యాన్నిచ్చాయి. అనంతరం కొవిడ్‌ను జయించేందుకు చేసిన తమ ప్రయత్నాన్ని ‘ఈటీవీ భారత్’తో పంచుకున్నారు.

నాకు నేనే ధైర్యం చెప్పుకొన్నా..

కొవిడ్‌ నిర్దారణ కాగానే అందరికీ హోమ్‌ ఐసోలేషన్‌ కిట్లు ఇచ్చారు. బాబు కోసం ఒక గదిలో అడ్డుగా తెర కట్టాం. తాను అక్కడే ఉండేవాడు. బయటి మరుగుదొడ్డి ఉపయోగించేవాడు. రోజూ భోజనం తయారు చేసి వేడివేడిగా బాబుకు ఇచ్చేవాళ్లం. నాకు నేనే ధైర్యం చెప్పుకొనేవాడిని. మూడుపూటలా ఆవిరి పట్టడం, కషాయం, వేడినీటిని తాగటం క్రమం తప్పకుండా పాటించాం. ఆత్మీయులు రోజూ ఫోన్‌ చేసి ధైర్యం చెప్పేవారు. మా సోదరుడు, స్నేహితులు కావాల్సిన వస్తువులు ఇచ్చి వెళ్లేవారు. కొవిడ్‌ సోకిందని బెంబేలెత్తకుండా ఉండాలి. పదేపదే అవే ఆలోచనతో మనసును ఒత్తిడికి గురి చేయకూడదు. క్రమం తప్పకుండా మందులు వాడుతూ, పోషకాహారం తీసుకోవాలి. వీటన్నింటినీ మించి స్నేహితులు, కుటుంబ సభ్యుల అండదండలు కొండంత ధైర్యాన్నిస్తాయనేది మా కుటుంబం నేర్చుకున్న పాఠం.

ABOUT THE AUTHOR

...view details